15 July, 2026 | 12:41 AM

మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు

15-07-2026 12:00 AM

మానకొండూరు, జులై 14, (విజయక్రాంతి): మండల కేంద్రమైన మానకొండూరులో మంగళవారం జరిగిన మండల బిజెపి కార్యవర్గ సమావేశం రసభాసమైంది. గత కొన్నాళ్లుగా మండల బిజెపి పార్టీలో చాపకింద నీరులా సాగుతున్న అసంతృప్తి జ్వాలలు మండల కార్యవర్గం సమావేశం సాక్షిగా బహిర్గతమయ్యాయి.

కార్యకర్తల మండల, జిల్లా, నాయకుల అసంతృప్తి, ఆగ్రహ జ్వాలలు పెల్లుబికి భాజపా మానకొండూరు మండల అధ్యక్షుడు కంది రాజిరెడ్డిని సమావేశంలోనే పలువురు సభ్యులు నిలదీశారు. అధ్యక్ష స్థానంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రశ్నించే వారిని పక్కన పెడితే పార్టీ బలోపేతం ఎలా అవుతుందని సమావేశంలో నేరుగా కార్యకర్తలు, పార్టీ బాధ్యులు, సమావేశంలో మండల అధ్యక్షున్ని నిలదీశారు.

మానకొండూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతమై పటిష్టంగా కొనసాగే పరిస్థితులలో గతంలో ఉండేదని, నేడు పార్టీ తిరోగమనంలో కొనసాగే పరిస్థితి ఎందుకు దాపరించిందో చెప్పాలని, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ రాజేశ్వర్ రెడ్డితో పాటు సమావేశంలో పలువురు సభ్యులు నిప్పులు చెరిగారు. . పచ్చునూరు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ ఫండ్ గా అధిష్టానం పంపిన 3 లక్షల రూపాయల్లో లక్ష రూపాయలు ఎవరి దగ్గర ఉన్నాయని, రెండు లక్షల రూపాయలు మాత్రమే చెల్లించారని, పోటీ చేసిన అభ్యర్థి నేరుగా అధ్యక్షున్ని ప్రశ్నించగా, సమాధానం కరువైంది.

అవి సొంతానికి వాడు కున్నారా, నేటికిని ఈ విషయంపై స్పష్టత కరువైందని, ఈ రూపాయలు ఎవరు వాడుకున్నారని సమావేశంలో సమాధానం చెప్పాలని అభ్యర్థి నిలదీశారు. మండలంలో ఇసుక క్వారీ నుండి గతంలో వసూలు చేసిన 25 లక్షలు, ఇటీవల సేకరించిన 10 లక్షల రూపాయలు ఏమయ్యాయని సమావేశంలో కార్యకర్తలు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. కనీసం ఫోన్ లోనైనా సమావేశాలకు సమాచారం అందించాలని అందర్నీ పార్టీలో కలుపుకొని వెళ్లి పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలు, మండల, జిల్లా, బాధ్యులు మూకుమ్మడిగా కోరారు.