ఓటు బ్యాంక్ కుట్ర
- కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం కుమ్మక్కు
- రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల కోసమే..
- అందుకే హైదరాబాద్‌లో ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్!
- అక్రమ చొరబాటుదారులకు బ్యాక్‌డోర్ ద్వారా ఓటు హక్కు
- ఎఫ్‌ఆర్‌సీపై లీగల్‌గా పోరాడుతాం
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు
హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు ఓటు బ్యాంక్ కుట్రలకు పాల్పడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు విమర్శించారు. కర్ణాటక మోడల్ తరహాలోనే హైదరాబాద్‌లోనూ ‘ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్’ (ఎఫ్‌ఆర్‌సీ) పేరుతో కొత్త పద్ధతికి తెరలేపాయని, సరైన గుర్తింపు కార్డులు లేని రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల ఓట్ల కోసం కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు.
అక్రమ చొరబాటుదా రులకు బ్యాక్‌డోర్ ద్వారా ఓటు హక్కు కల్పించే కుట్ర జరుగుతోందని తెలిపారు. స్థానిక అధికారులపై ఒత్తిడి తెచ్చి అక్రమ నమోదులను ప్రాత్సహిస్తూ బీజేపీకి వ్యతిరేక ఓట్లను పెంచుకునేందుకు ఈ మూడు పార్టీలు స్కెచ్ వేశాయని విమర్శించారు. ఈ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ దోపిడీపై లీగల్‌గా, రాజకీయంగా పోరాటం చేస్తామని రాంచందర్ రావు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు బయటికి సర్‌ను విమర్శిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో దొంగ ఓట్లు చేర్పించేందుకు ప్రయత్నిస్తున్నాయని..ఈ కుట్రలను పార్టీ శ్రేణులు పూర్తి కమిట్‌మెంట్‌తో తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ‘విశ్వేశ్వరయ్య భవన్’లో నిర్వహించిన సర్ రెండవ విడత (ఫేజ్-2) రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో రాంచందర్‌రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ మొదటి విడత సమర్థవంతంగా పూర్తయిందని, బాధ్యతాయుతంగా పనిచేసిన సర్ ప్రతినిధులకు, శ్రేణులకు ఆయన అభినందనలు తెలిపారు.
దాదాపు 21 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత సర్ ప్రక్రియ రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జరుగుతోందే తప్ప కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రక్రియ కాదని ఆయన స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా నుంచి దొంగ ఓట్లను తొలగించడం, చనిపోయిన, ఇతర ప్రాంతాలకు మారిన వారి ఓట్లను సరిదిద్ది, అర్హులైన ప్రతి పౌరుడికి కొత్త ఓటు కల్పించడమే సర్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
అర్హులైన ఓట్లు సరిచూసుకోవాలి
ఈనెల 7న విడుదలైన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రతి బూత్ అధ్యక్షుడు, బీఎల్‌ఏ-1, బీఎల్‌ఏ-2 లు క్షుణ్ణంగా స్క్రూటినీ చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి బూత్‌లో సగటున 300 నుంచి 350 వరకు ఉన్న డూప్లికేట్, బోగస్ ఓట్లు తొలగిపోతున్నాయని, పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తగ్గడానికి ఈ నకిలీ ఓట్లే కారణమని వివరించారు.
రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఇదే ఓటర్ల జాబితా ప్రామాణికం అని స్పష్టం చేశారు. కాబట్టి, డ్రాఫ్ట్ రోల్‌లో మన అర్హులైన ఓట్లు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలన్నారు. అర్హులైన కొత్త ఓటర్ల నమోదుకు ఫారమ్-6, దొంగ ఓట్ల తొలగింపునకు ఫారమ్-7, వివరాల సవరణకు ఫారమ్-8లను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.
పట్టభద్రుల డేటా సేకరించాలి
పోలింగ్ బూత్‌ల రేషనలైజేషన్, గేటెడ్ కమ్యూనిటీలు, ఓటర్లకు దగ్గరలోని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల కేటాయింపుపై కూడా బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే రాబోయే హైదరాబాద్ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, నవంబర్ 1, 2025 కంటే ముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అర్హులైన పట్టభద్రుల డేటాను ఇప్పుడే సేకరించాలని చెప్పారు.
వారి ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, సర్ రాష్ట్ర కన్వీనర్ వేముల అశోక్, సర్ నిర్వాహకులు శశిధర్‌రెడ్డి, ఆంటోనీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఎల్‌ఏ-1, బీఎల్‌ఏ-2లు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.






