ఓట్లు తొలగిస్తున్నారు!
- బీజేపీ సానుభూతిపరులపై కుట్ర
- కాంగ్రెస్, ఎంఐఎం కుమ్మక్కై అనర్హులను చేరుస్తున్నారు
- బీఎల్‌ఓలపై రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులు
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
- రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు
హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): సర్ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో సిబ్బంది కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని, బీజేపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచర్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్, ఎంఐఎం కుమ్మక్కై అనర్హులను చేరుస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డిని రాంచందర్‌రావు నేతృత్వంలోని నేతలు కలిసి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో రాంచందర్‌రావు మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో బీజేపీకి అనుకూలంగా ఉండే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని వారి పేర్లు ఓటరు జాబితాలో నమోదు కాకుండా కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఓటర్లు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఓటు నమోదు విషయం లో ఎక్కడైనా ఒత్తిళ్లు, బెదిరింపులు, అక్రమాలు ఎదురైతే బీజేపీ దృష్టికి తేవాలని కోరారు.
ఈ అం శాలపై సమగ్ర విచారణ జరిపి, ఓటర్ల హక్కులను పరిరక్షించేలా తగిన చర్యలు తీసుకుంటామని ప్రధాన ఎన్నికల అధికారి హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఒకే వ్యక్తికి ఒకే చోట మాత్రమే ఓటు ఉండాలని, రెండుచోట్ల ఓటు నమోదు చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. కానీ, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన అర్హులైన ఓటర్ల పేర్లు నమోదు కాకుండా కొందరు కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు.
తాను స్వయంగా కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలను ప్రత్యక్షంగా గమనించానని, అక్కడ అర్హులైన ఓటర్లను తప్పుదోవ పట్టించడం, నమోదు ప్రక్రియకు ఆటంకాలు కల్పించారన్నారు. చేవెళ్ల, మల్కాజిగిరి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో నివసిస్తున్న నార్త్ ఇండియన్స్, ఐటీ ఉద్యోగులు ఇక్కడే ఓటు నమోదు చేసుకోవాలని ముందుకు వస్తున్నప్పటికీ, వారిని ఓటరు జాబితాలో చేర్చకుండా ప్రయత్నించడం ఎన్నికల కమిషన్ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమన్నారు.
పాతబస్తీలో సర్ నిర్వహణకు సీనియర్లకు బాధ్యత అప్పగించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులైన బీఎల్‌ఓలపై రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులు రావడం అత్యంత ఆందోళనకరమైన విషయం, ఈ అంశాలన్నింటినీ ప్రధాన ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అదేవిధంగా 2025 నుంచి బీఎల్‌ఓలకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేసి వారికి న్యాయం చేయాలన్నారు.






