calender_icon.png 6 November, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హర్యానాలో ఓట్ చోరీ!

06-11-2025 01:35:29 AM

రాహుల్ హైడ్రోజన్ బాంబ్

గత అసెంబ్లీ ఎన్నికల్లో 22 సార్లు ఓటేసిన ‘బ్రెజిల్ మోడల్’

  1. 25 లక్షల ఓట్లు బోగస్ 
  2. ఐదు రకాలుగా ఓట్ల చోరీ 
  3. ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆరోపణలు

న్యూఢిల్లీ, నవంబర్ 5: ఓట్ల చోరీ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిం చారు. గతేడాది జరిగిన హర్యానా అసెం బ్లీ ఎన్నికల్లోనూ భారీగా ఓట్ల చోరీ జరిగిందంటూ బాంబు పేల్చారు. ఓట్ల చోరీ కి పాల్పడేవారిని కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఈసీ ఖూనీ చేస్తోందని రాహుల్ ఆరోపించారు. బీజేపీ నేతలు అనేక వ్యవస్థలను ఉపయోగించి దాదాపు 25 లక్షల ఓట్లను చోరీ చేశారని వెల్లడించారు. పోలై న మొత్తం ఓట్లలో దాదాపు 12.5 శాతం నకిలీవేనని వెల్లడించారు.

హర్యానా ఎన్నికల్లో బ్రెజిల్‌కు చెందిన ఒక మోడల్ పేరు తో 22 ఓట్లు ఉండడం తనను ఆశ్చర్యపరిచిందని రాహుల్ పేర్కొన్నారు. ఆమె ఒక్క ఫొటోను ఉపయోగించి.. సీమా, స్వీటీ, సరస్వతి, సుమన్, రష్మీ అంటూ పేర్లు, వయసులు, జెండర్లు మార్చుతూ 10 పోలింగ్ బూత్‌ల్లో 22 నకిలీ ఓట్లు సృష్టించారని ధ్వజమెత్తారు.  అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తంగా 5 రకాలుగా ఓట్ల చోరీ జరిగిందని విమర్శించారు. డూప్లికే ట్, చెల్లని ఓట్లు, బల్క్ ఓట్లు, ఫామ్-6, ఫామ్-7 దుర్వినియోగంతో బీజేపీ-ఈసీ కలిసి ఓట్ల చోరీకి పాల్పడ్డాయన్నారు.

5 లక్షలకు పైగా నకిలీ ఓట్లు

ఢిల్లీలో బుధవారం మీడియాతో రాహుల్ మాట్లాడుతూ.. ‘బ్రెజిల్ మోడల్ పేరుతో 10 పోలింగ్ బూత్‌ల్లో 22 ఓట్లు ఉన్నాయి. ఒకే ఫోటోతో 253 ఓట్లు రెండు పోలింగ్ బూతుల్లో ఉన్నాయి. హర్యానాలో మొత్తం 2 కోట్ల 5 లక్షల 51వేల 619 నకిలీ ఓట్లు ఉన్నాయి. వీటిలో ప్రతి 8 ఓట్లలో ఒకటి నకిలీదే . నకిలీ ఫొటోలతో లక్షకు పైగా ఓట్లు ఉన్నాయి. 93, 174 ఓట్లు తప్పుడు అడ్రస్‌లతో ఉన్నట్లు గుర్తించాం. ఎన్నికల సమయంలో కొందరు కావాలనే ఓటర్లను చేర్చారు. ఈ కారణాల వల్లనే కాంగ్రెస్ గెలుస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ హర్యానాలో ఓటమి పాలయ్యాం. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చాయి. చివరికి 22 వేల 779 ఓట్లతో పరాజయం చవిచూశాం.’ అని వెల్లడించారు.

ఈసీ ఏం చేస్తున్నట్లు?

ఎన్నికల సమయంలో ఇన్ని అక్రమాలు జరుగుతుంటే కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తుందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. నకిలీ ఓటర్లను గుర్తించేందుకు ఎన్నికల కమిషన్ వద్ద సాఫ్ట్‌వేర్ కూడా ఉన్నప్పటికీ.. 5 లక్షలకు పైగా నకిలీ ఓటర్లు ఎలా వచ్చాయని నిలదీశారు. ఈసీ తలచుకుంటే సెకన్ల వ్యవధిలో నకిలీ ఓట్లను తొలగించేదని.. బీజేపీకి లబ్ది చేకూర్చేందుకే ఎన్నికల సంఘం అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లో ఓటు వేసిన వేలాదిమంది హర్యానాలోనూ ఓటు వేశారని అన్నారు.

బీజేపీ నాయకులు అడ్రస్‌లతో వందల సంఖ్యలో నకిలీ ఓట్లు ఉన్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ వాళ్లనయినంత మాత్రాన దేశంలో ఎక్కడైనా ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలకు ముందు బీజేపీ నేత, హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ మీడియా సమావేశంలో మాట్లాడిన వీడియోను కూడా ప్రదర్శించారు. ‘అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయి.. బీజేపీ విజయం సాధిస్తుంది’ అని ఆయన చెప్పడం వీడియోలో రికార్డయ్యింది.

‘ఏంటా ఏర్పాట్లు? పోలింగ్ జరిగిన రెండు రోజుల తర్వాత ప్రతి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో విజయం సాధిస్తుందని చెప్పారు... ఈ పెద్దమనిషి చాలా ఖచ్చితంగా, నవ్వుతూ, బీజేపీ ఏర్పాట్లు చేసిందని చెబుతున్నాడు.’ అని రాహుల్ గాంధీ విమర్శించారు. హర్యానా చరిత్రలోనే తొలిసారి పోస్టల్ బ్యాలెట్ ఫలితాలకు విరుద్దంగా పోలింగ్ బూత్‌లలో ఫలితాలు వచ్చాయని దుయ్యబట్టారు.

మీ ఏజెంట్లు నిద్రపోతున్నారా?: ఈసీ

రాహుల్ ఆరోపణలకు కేంద్ర ఎన్నికల సంఘం ధీటుగా బదులిచ్చింది. రాహుల్ గాంధీ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్)కు మద్దతు ఇస్తున్నారా? లేదా వ్యతిరేకి స్తున్నారా? అని ప్రశ్నించింది. సర్ ద్వారానే ఈసీ.. నకిలీ, చనిపోయిన, వేరే ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లను తొలగిస్తుందని తీసీ పేర్కొంది. అయితే హర్యానా ఓటర్ల జాబితాకు వ్యతిరేకంగా ఎలాంటి అప్పీళ్లు దాఖలు కాలేదని ఈసీ స్పష్టం చేసింది. పంజాబ్ హైకోర్టులో 22 ఎన్నికల పిటిషన్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని ఎన్నికల సంఘం వర్గాలు వెల్లడించాయి.

అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు బీహార్‌లో ‘సర్’ ప్రక్రియ చేపట్టిన సమయంలోనూ కాంగ్రెస్ నకిలీ ఓట్లపై ఎందుకు అప్పీల్ చేయలేదో చెప్పాలని డిమాండ్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హర్యానాలో నకిలీ ఓట్లు ఉన్నాయని తెలిసిన రోజునే స్పందించాల్సిన కాంగ్రెస్ బూత్ లెవెల్  ఏజెంట్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఒక ఓటరు అప్పటికే ఓటు వేసి ఉన్నా, ఓటర్ గుర్తింపుపై ఏదైనా సందేహం ఉన్నా అభ్యంతరాలు వ్యక్తం చేయాలి. మరి అప్పుడు మీ ఏజెంట్లు నిద్ర పోతున్నారా అని నిలదీసింది.

ఇప్పటివరకు దీనిపై కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లు ఎలాంటి వాదనల్ని, అభ్యంతరాల్ని లేవనెత్తలేదని ఈసీ ఎత్తి చూపింది. నకిలీ ఓటర్లు ఉంటే, వారంతా బీజేపీకి మద్దతు ఇచ్చారని రాహుల్ గాంధీ ఎలా చెబుతున్నారో అర్థం కావడం లేదని ఈసీ వ్యాఖ్యానించింది. అలా కాకుంటే బదులుగా ఈ ఓటర్లంతా కాంగ్రెస్‌కు ఓట్లు వేసి ఉండొచ్చు కదా అని అనుమానం వ్యక్తం చేసింది. 

ఆరోపణలన్నీ వ్యర్థమే : బీజేపీ

బీహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి ఓటమి పాలవుతుందన్న భయంతోనే రాహుల్ గాంధీ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ మండిపడింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు మాట్లాడుతూ.. రాహుల్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే హర్యానా అంశంతో మీడియా ముందుకు వచ్చారు. బీహార్‌లో గురువారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో హర్యానా గురించి ఒక కట్టుకథ అల్లుతున్నారు. హర్యానా ఎన్నికల్లో బ్రెజిల్ మోడల్ ఫోటోగ్రాఫ్‌ను వివిధ పేర్లతో వాడుకున్నారని రాహుల్ ఆరోపణలను రిజిజు తోసిపుచ్చారు.

బీహార్‌లో జరగబోయే ఎన్నికల్లో ఓటమి ఖాయమనే భయంతో ఇలా అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాహుల్ తన విదేశీ పర్యటనల్లో సమాచారం సేకరించి దాన్ని భారత్‌లో వర్తింపజేయాలని చూస్తున్నారు.ప్రతిపక్ష నేతగా సీరియస్ అంశాలు ప్రస్తావించేలా కానీ అనవసర విషయాలపై మాట్లాడి సమయం వృథా చేయకపోవడం మంచిదని సలహా ఇచ్చారు. 

ఎవరీ బ్రెజిలియన్ మోడల్?

హర్యానాలో బ్రెజిల్ మోడల్‌కు ఓటు హక్కు కలిగి ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకే అసెంబ్లీ సెగ్మెంట్‌లో 10 బూత్‌ల్లో వివిధ పేర్లతో 22 ఓట్లు కలిగి ఉండడం గమనార్హం. -సీమా, స్వీటీ, సరస్వతి, సుమన్, రష్మీ అనే మారుపేర్లతో ఓటు హక్కు కలిగిన బ్రెజిల్ మోడల్ అసలు పేరు ఏంటనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అయితే 2017లో మాథ్యూస్ ఫెర్రిరో అనే ఫోటో గ్రాఫర్.. నీలం రంగు డెనిమ్ జాకెట్ ధరించిన సదరు మోడల్ ఫోటోలను తీసినట్లు గూగుల్ రివర్స్ ఇమేజ్ ద్వారా బయటపడింది. స్టాక్ ఫోటోగ్రఫీ, పిక్సల్, అన్‌స్లాష్ వెబ్‌సైట్‌ల నుంచి బ్రెజిల్ మోడల్ ఫోటోను కొన్నివేల సార్లు డౌన్‌లోడ్ చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బ్రెజిల్ మోడల్ ఫోటోను పలుమార్లు ఉపయోగించి పేర్లు, జెండర్ మారుస్తూ నకిలీ ఓట్లు సృష్టించారని రాహుల్ ఆరోపించారు.