పాలమూరులో గెలుపెవరిది?
బూత్‌ల వారీగా డాటా సేకరించి పరిశీలిస్తున్న అభ్యర్థులు
పార్టీలకు మొగ్గు చూపే అంశాలపై ఫోకస్
తమదే గెలుపు అని ప్రధాన పార్టీల ధీమా
మహబూబ్‌నగర్ సెగ్మెంట్‌లో 72.43 శాతం ఓటింగ్ నమోదు
మహబూబ్‌నగర్, మే 14 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికలతో మూడు నెలలుగా వేడెక్కిన రాజకీయం సోమవారం పోలింగ్ తర్వాత ఒక్కసారిగా సైలెన్స్‌గా మారిపోయింది. అభ్యర్థుల ప్రచార రథాలు, పార్టీ అధినేతల రోడ్ షోలతో హోరెత్తించిన మైకులు మూగబోయాయి. ఇక పోలింగ్ పూర్తి కావడంతో ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తమ గెలుపే ఖాయమని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ తర్వాత నివేదికలు తెప్పించుకుని తమకు ఇంత మెజారిటీ వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, గెలుపు ఎవరిదో తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.
బీజేపీ ముందు చూపు.. బలగంతో కాంగ్రెస్
ఆర్నెల్ల ముందుగానే కేంద్రంలో అధికార బీజేపీ ముందుచూపుతో అడుగులు వేసింది. అయోధ్య రామమందిర నిర్మాణం, కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుతోపాటు జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పిస్తామన్న హామీతో ప్రచారంలో ముందడుగు వేసింది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోనూ ఇంటింటికీ తిరిగి శ్రీరాముడి అక్షింతలు బీజేపీ శ్రేణులు అందించారు. ఈ సెంటిమెంట్ హిందువుల్లో కొంత మేరకు బాగానే పనిచేసింది. గెలుపు ధీమాపై బీజేపీ ఒక అడుగు ముందు వరుసలో ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతోపాటు కొడంగల్ నియోజక వర్గం మినహా అన్ని ప్రాంతాల్లో బీజేపీకి లీడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ధీమాగా ఉన్నారు. మహబూబ్‌నగర్ సెగ్మెంట్‌లో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇక్కడ కార్యకర్తలు చేసిన ప్రచారంతో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో తాయిలాలు అందించడంలోనూ పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నా రు. దీంతో చివర క్షణాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి మద్దతు అధికమైందని తెలుస్తుంది. మెజార్టీ తగ్గినా గెలుపు తమదేనని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది.
వెనుకంజలో బీఆర్‌ఎస్..
ఆర్నెల్ల పాలనతోనే వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంందని బీఆర్‌ఎస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. తాము అధికారంలో ఉన్నప్పుడు అందరినీ సమంగా చూశామని, అన్ని సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేసిన ఘనత బీఆర్‌ఎస్‌కే దక్కుతుందని ఆ పార్టీ చెప్పుకుంది. కేసీఆర్ నినాదాలు సైతం ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో సైలెంట్‌గా బీఆర్‌ఎస్క్ మద్దతు లభించిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా జనంలో మాత్రం బీఆర్‌ఎస్‌కు ప్రస్తుతం ఆశించిన మేరకు మద్దతు లేదని సర్వేలు పేర్కొంటున్నాయి. దీంతో బీఆర్‌ఎస్ జరిగిన ఈ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌లో వెనకంజలో ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయని పలువురు చర్చించుకుంటున్నారు.
ఓటింగ్ శాతం ఇలా..
మహబూబ్‌నగర్ పరిధిలో అత్యధికంగా షాద్‌నగర్ నియోజకవర్గంలో 77.40 శాతం ఓటింగ్ నమోదు కాగా మహబూబ్‌నగర్‌లో అత్యల్పంగా 66.27 శాతం రికార్డయింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా 72.43 శాతం పోలింగ్ జరిగింది.




