3 April, 2026 | 3:14 PM

మా సమస్యలకు మోక్షమెప్పుడో?

15-05-2024 01:50 AM

అపరిష్కృతంగానే టీచర్లు, ఉద్యోగుల సమస్యలు

ఏళ్ల తరబడి పేరుకుపోయిన బదిలీలు, పదోన్నతుల అంశం

పదోన్నతులు తీసుకోకుండానే రిటైర్డ్ అవుతున్న వైనం

డిమాండ్‌గానే మిగిలిపోయిన సీపీఎస్ రద్దు 

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. ముఖ్యం గా విద్యాశాఖలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఉపాధ్యాయులకు ప్రధాన సమస్య బదిలీలు, పదోన్నతులు. పాఠశాల విద్యాశాఖలో ఒకే క్యాడర్‌లో ఉంటూ మొత్తం సర్వీసులో ఒక్క ప్రమోషన్ కూడా పొందకుండా ఉద్యోగులు రిటైర్డ్ అవుతున్న పరిస్థితి ఉంది. బదిలీలు ఎప్పుడవుతాయో? ప్రమోషన్లు ఎన్నేళ్లకు వస్తాయో? అని ఎదురుచూస్తునే ఏళ్లు గడిచిపోతున్నాయి.తమ జీవితంలో ఒక్క ప్రమోషన్ కూడా పొందకుండానే రిటైర్ అవుతున్నామంటూ ఉపా ధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ బదిలీలు, పదోన్నతులు చేపడదామని విద్యాశాఖ ప్రక్రియను ప్రారంభించినా అది ఎప్పుడు మొదలవుతోందో? ఎప్పుడు పూర్తవుతోందో? కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఉపాధ్యాయేతర ఉద్యోగులు క్రమంగా పదోన్నతులు పొందుతూ ఉన్నత స్థానాలకు చేరుతున్నారు. కానీ టీచర్లు పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇప్పటికే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ చేపట్టి ఏళ్లు గడుస్తున్నా ఇంకా మోక్షం లభించలేదు. దీనిపై హైకోర్టులో వందల్లో పిటిషన్లు దాఖలు చేయడంతో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ అసంపూర్తిగానే మిగిలిపోయింది. దీనికితోడూ జీవో 317, స్థానికేతర జిల్లాలకు బదిలీలు తోడయ్యాయి. జూనియర్ లెక్చరర్, డైట్ లెక్చరర్, ఎంఈఓ, డిప్యూటీ ఈవో, స్కూల్ అసిస్టెంట్, హెచ్‌ఎం, ఎస్జీటీలు సకాలంలో ప్రమోషన్లు పొందలేకపోతున్నారు. జోన్ హెచ్‌ఎం, స్కూల్ అసిస్టెంట్‌లకు పదోన్నతులు కల్పించిన విద్యాశాఖ కోర్టు కేసుల కారణంగా జోన్ పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. కోర్టు నుంచి పదోన్నతులకు అనుమతిలభించడంతో టెట్ రూపంలో మరొక సమస్య వచ్చి పడింది. 

అపరిష్కృతంగానే స్పౌజ్ బదిలీలు...

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317 కారణంగా ఉద్యోగస్తులైన భార్యాభర్తలకు వివిధ జిల్లాల్లో పోస్టులు ఇచ్చారు. భర్త ఒక జిల్లాకు, భార్య మరో జిల్లాకు బదిలీ అయ్యారు. అయితే తమను ఒకే జిల్లాకు కేటాయించాలని దాదాపు రెండున్నరేళ్లుగా స్పౌజ్ బాధితులు పోరా టం చేస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినా గత ప్రభుత్వ హయాంలో ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఇంతలోనే అసెంబ్లీ ఎన్నికలొచ్చాయి. ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వంలోనైనా తమ సమస్య తీరుతుందని భావించిన ఉపాధ్యాయులకు అది కలగానే మిగిలిపోయింది. 2023లో అప్పటి ప్రభుత్వం కేవలం 615 స్పౌజ్ బదిలీలను మాత్రమే చేపట్టి 13 జిల్లాల్లోని మిగతా స్పౌజ్ బదిలీలను పెండింగ్‌లోనే పెట్టింది.

పదోన్నతులకు టెట్ అడ్డంకి...

నిలిచిపోయిన బదిలీలు, పదోన్నతులను వెంటనే చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. గతంలో బదిలీ అయిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని టీచర్లు కోరుతున్నారు. మల్టీ జోన్ 2లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాద్యాయుల పదోన్నతుల వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు టీచర్ల పదోన్నతులకు టెట్ అడ్డంకిగా మారింది. ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు టెట్ అవసరంలేదని ఎన్‌సీటీఈ అంటుంటే విద్యాశాఖ మాత్రం కావాలంటూ గందరగోళానికి తెరలేపింది. ఒకే లెవల్ ఉన్న పోస్టులకు 2010 కంటే ముందు ఉపాధ్యాయులకు టెట్ అవసరం లేదని ఎన్‌సీటీఈ స్పష్టం చేసినా అధికారులు మాత్రం పదోన్నతుల ప్రక్రియను చేపట్టడంలేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

పెండింగ్ బిల్లుల కోసం ఎదరుచూపులు...

పెండింగ్ బిల్లుల కోసం ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎంతోకాలంగా ఎదురుచూస్తు న్నారు. ఖజానా కార్యాలయాల్లో ఆమోదం పొంది ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న మెడికల్ రీయింబర్స్‌మెంట్, జీపీఎఫ్, టీఎస్‌జీఎల్‌ఐ, డీఏ బకాయిలు, సప్లిమెంటరీ జీతాలు, పీఆర్సీ పెన్షన్ బకాయిలు విడుదలకు నోచుకోవడంలేదు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గృహనిర్మాణం, పిల్లల పెళ్లిళ్లు, చదువులు ఇతరత్రా అవసరాలకోసం విడుదల చేయాలని విజ్ఞప్తులు చేస్తున్నా పట్టిం చుకోవడంలేదని వాపోతున్నారు. పీఆర్సీ అమలు కోసం కమిషన్ చైర్మన్ ఎన్ శివశంకర్‌తో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల తో పలు దఫాలుగా సమావేశమవుతున్నారు. ఇప్పటికే సమావేశమైన ఆయా సంఘాల నేతలు 40 నుంచి 50 శాతం ఫిట్‌మెంట్‌ను పెంచి పీఆర్సీ ప్రకటించాలని కమిషన్‌కు ముందు ప్రతిపాదనలు పెట్టారు.

విద్యాశాఖకు మంత్రే లేరు..

నూతన ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు గడిచినా ఇంత వరకూ విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రిని కేటాయించలేదు. అయితే ఈ శాఖ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దనే ఉంది. విద్యాశాఖపై రెండుమూడు సార్లు సీఎం సమీక్షలు నిర్వహించారు కూడా. అయితే ప్రత్యేకించి మంత్రిని కేటాయించకపోవడంతో ప్రతి సమస్యను సీఎం చెంతకు తీసుకుపోవడం అటు అధికారులకు, ఇటు ఉపాధ్యాయ సంఘాలకు కష్టతరంగా మారింది. విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలని సంఘాల నేతలు కోరుతున్నారు.

సీపీఎస్ రద్దు అయ్యేనా?

సీపీఎస్ (కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం)ను రద్దు చేసి ఓపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీం)ను అమలు చేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. సీపీఎస్ రద్దు చేసిన వారికే తమ మద్దతు అనడంతో రాజకీయ పార్టీలు గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలు మ్యానిఫెస్టోల్లో ఈ అంశాన్ని పొందుపర్చాయి. 1.60 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన ఈ అంశం అపరిష్కృతంగానే మిగిలింది. ఇక గత ప్రభుత్వం జారీ చేసిన హెల్త్‌కార్డులు పనిచేయడంలేదు. దీంతో సొంత ఖర్చులతో వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు బిల్లులు పెట్టుకుంటే అవి ఎప్పుడు మంజూరు అవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే పూర్తి నగదు రహిత చికిత్స అందించేందుకు హెల్త్ స్కీం రూపొందిస్తూ గతంలో ప్రభుత్వం జీవో జారీ చేసి చేతులు దులుపుకుందనే ఆరోపణలున్నాయి.

50 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటించాలి

విద్యాశాఖలోని పలు పెండింగ్ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించాలి. 50 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని ప్రకటించాలి. గత పీఆర్సీ ప్రతిపాదనల మేరకు నూతన హెల్త్ స్కీం రూపొందించి దాన్ని అమలు పరచాలి. ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను ఖాతాల్లో జమ చేయాలి. పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలి. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం కొనసాగించాలి. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వర్తింపచేయాలి. మిగిలిన పెండింగ్ సమస్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సహృదయంతో పరిష్కరించాలి.

 బీరెల్లి కమలాకర్ రావు, పీఆర్టీయూ టీఎస్ ప్రధాన కార్యదర్శి