సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం... గ్రూప్-1 ఆశావహులకు ఇది పెద్ద ఊరట
హైదరాబాద్: తెలంగాణ గ్రూప్ -1(Telangana Group 1) ఉద్యోగ నియామకాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు. ఇది ఉద్యోగ నియామకాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ పారదర్శకతకు, చిత్తశుద్ధికి గుర్తింపుగా భావిస్తున్నామని తెలిపారు. కొలువుల కోసం ఏళ్లకు ఏళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసి, కన్నవారి కష్టంపై ఆధారపడలేక, కొలువు వస్తుందో రాదో అన్న దిగులుతో పదేళ్లు కాలం వెళ్లదీసిన గ్రూప్ -1 ఆశావహులకు ఇది పెద్ద ఊరటని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రజా ప్రభుత్వం వచ్చీరావడంతోనే నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు నిర్వహించి నెలల వ్యవధిలో నియామక పత్రాలు అందజేసి, ఈ నియామకాలను అడ్డుకోవాలనుకున్న దుష్ట శక్తుల కుట్రలను కుతంత్రాలను ఛేదించి, రాష్ట్ర పునర్ నిర్మాణంలో తొలి గ్రూప్ -1 అధికారులుగా యువతను భాగస్వాములను చేశామన్న ముఖ్యమంత్రి వారికి మరో సారి అభినందనలు తెలిపారు. ప్రభుత్వం ఆలోచనలు, సంకల్పానికి అనుగుణంగా టీజీపీఎస్సీ(Telangana State Public Service Commission) వ్యవస్థను ప్రక్షాళన చేసి నిరుద్యోగ యువతకు వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని పునరుద్ధరించి, అత్యంత పారదర్శకంగా ఈ నియామకాలను పూర్తి చేసిన టీజీపీఎస్సీ ఛైర్మన్, ఉద్యోగులు, సిబ్బందిని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.




