3 April, 2026 | 12:22 PM

కోనరావుపేట గ్రామసభ రసభస

03-04-2026 10:48 AM

– పథకాల అమలు పై గ్రామస్తుల ఆగ్రహం, సమాధానం లేక సభ ముగింపు

కోనరావుపేట,(విజయక్రాంతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో( Praja Palana – Pragati Pranalika) భాగంగా కోనరావుపేట మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభ ఉద్రిక్త వాతావరణంలో సాగి చివరికి రసభసగా ముగిసింది.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై గ్రామస్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులను, ప్రజాప్రతినిధులను బహిరంగంగా నిలదీశారు.సభ ప్రారంభంలో అధికారులు ప్రభుత్వ పథకాల పురోగతిని వివరించేందుకు ప్రయత్నించగా, గ్రామస్థులు ఒక్కసారిగా ఆగ్రహంతో లేచి ప్రశ్నలు సంధించారు.ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించిన “ఆరు గ్యారెంటీలు” అమలు విషయంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

“ప్రకటనలకే పరిమితమైపోయిన ఈ పథకాలు గ్రామస్థులకు ఎక్కడ అందుతున్నాయి?” అంటూ ప్రజలు ప్రశ్నించారు.రైతు భరోసా పథకం కింద రెండు దఫాలు డబ్బులు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పినా అది అందుబాటులో లేదని మహిళలు తెలిపారు.గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతుందని చెప్పినా బిల్లులు యథావిధిగా వస్తున్నాయని వినియోగదారులు మండిపడ్డారు.ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై కూడా గ్రామస్థులు తీవ్ర ఆరోపణలు చేశారు. అర్హులైన పేదలకు ఇళ్లు కేటాయించకుండా, కమిటీ సభ్యుల అనుచరులకు, పరిచయస్తులకు ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు.

ఈ వ్యవహారంపై పారదర్శక విచారణ జరపాలని డిమాండ్ చేశారు.ఇక రబీ సీజన్‌లో వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, ఇప్పటి వరకు అది అమలు కాలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతున్న ఆదాయంతో రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ హామీలు అమలు చేయకపోవడం తీవ్ర అన్యాయం అని అన్నారు.గ్రామస్థులు అడిగిన ప్రశ్నలకు ప్రజాప్రతినిధులు, అధికారులు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారు. కొంతసేపు వాగ్వాదాలు చోటుచేసుకుని సభలో ఉద్రిక్తత మరింత పెరిగింది. పరిస్థితి అదుపు తప్పుతుందనే భావనతో అధికారులు, ప్రజాప్రతినిధులు సభను ముగించుకుని వెళ్లిపోయారు.ఈ ఘటనతో గ్రామస్థుల్లో ప్రభుత్వంపై అసంతృప్తి మరింత పెరిగింది. పథకాల అమలులో పారదర్శకత, సమానత్వం ఉండాలని, అర్హులందరికీ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.