25 July, 2026 | 1:47 AM

వీటీఏడీఏ పనులు వేగవంతం చేయాలి

25-07-2026 12:00 AM

కలెక్టర్ గరిమ అగ్రవాల్

వేములవాడ, జూలై 24, (విజయక్రాంతి): వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (వీటీఏడీఏ) ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రణాళిక ప్రకారం గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ, నిత్యాన్నదాన సత్రం నిర్మాణం, గుడి చెరువు బండ్ పార్క్ సుందరీకరణ, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ, 80 అడుగుల రహదారి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

దేవస్థానం విస్తరణ పనులను దశలవారీగా వేగవంతం చేయాలని, నిత్యాన్నదాన సత్రం నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. గుడి చెరువు సుందరీకరణలో ఆర్చ్తో పాటు తుది దశ పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ, ప్రధాన ఆలయం నుంచి తిప్పాపూర్ బ్రిడ్జి వరకు చేపడుతున్న 80 అడుగుల రహదారి పనుల్లో వేగం పెంచాలని అధికారులు, కాంట్రాక్టర్కు సూచించారు.