25 July, 2026 | 1:47 AM

సత్తుపల్లిలో అక్రమ దుకాణాల తొలగింపు

25-07-2026 12:00 AM

రోడ్డు ఆక్రమణతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికుల ఆవేదన

సత్తుపల్లి. జూలై 24. ( విజయ క్రాంతి ): ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న కరెంటు కార్యాలయం ప్రాంగణాన్ని ఆక్రమించుకుని కొంతమంది కొంతకాలంగా చిన్నచిన్న బడ్డీ దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం వాటిని ఇతరులకు నెలకు రూ.5,000 నుంచి రూ.22,000 వరకు అద్దెకు ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అటు కరెంటు కార్యాలయం, ఇటు జాతీయ రహదారిపై వ్యాపారాలు నిర్వహించడం వల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు.కొంచెం వెనక్కి జరగాలని ఎవరైనా సూచిస్తే వ్యాపారులు గొడవకు దిగుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఈ సమస్యపై మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో ప్రజలు కోర్టును ఆశ్రయించారు.ప్రజల పిటిష్ప విచారణ జరిపిన కోర్టు, వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలను అనుసరిస్తూ అక్కడ ఉన్న దుకాణాలను వ్యాపారులు ఖాళీ చేస్తున్నారు.