మధ్యప్రాచ్యంపై యుద్ధమేఘాలు
నివురుగప్పిన నిప్పులా ఇరాన్
ఏ క్షణంలోనై సైనికదాడికి అమెరికా వ్యూహం
తమపై దాడి చేస్తే సహించబోమని ఇరాన్ హెచ్చరికలు
పొరుగు దేశాల్లోని అమెరికన్ స్థావరాలను ధ్వంసం చేస్తామని ప్రకటన
వెంటనే ఖతార్‌లోని సైనిక స్థావరాన్ని ఖాళీ చేసిన అమెరికా
టెహ్రాన్, జనవరి 14: మధ్యప్రాచ్యంపై యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. నివురుగప్పిన నిప్పులా ఇరాన్ పరిస్థితులు ఉద్రి క్తంగా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అక్కడి పౌరులు బిక్కుబి క్కుమంటున్నారు. మరోవైపు ఇరాన్ ప్రభు త్వం మూడు వారాల్లోనే ౨,౪౦౦ మందికి పైగా ఊచకోత కోసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న పౌరులపై ఉక్కుపాదం మోపుతున్నది.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పౌరుల ఊచకోతను సహించబోమని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు.. అవసరమైతే సైనిక చర్యకు దిగుతామని కూడా తేల్చి చెప్పారు. దీంతో ఇరాన్ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. అమెరికా తమ దేశంపై దాడి చేస్తే పొరుగు దేశాల్లోని అమెరికన్ సైని క స్థావరాలను ధ్వంసం చేస్తామని ప్రకటించింది. ఖతార్, యూఏఈ, టర్కీని అమెరికన్ సైనిక స్థావరాలే టార్గెట్ అని తేల్చిచెప్పింది.
ఖతార్ అమెరికన్ సైనిక స్థావరం ఖాళీ
ఇరాన్ ప్రకటనపై అమెరికా స్పందించింది. తాజాగా ఖతార్‌లోని అల్ ఉదైద్ వైమానిక స్థావరంలోని తమ సైనికులను, సిబ్బందిని యుద్ధప్రాతిపదికన స్వదేశానికి తరలించింది. ఈ విషయాన్ని ఖతార్ ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది. మధ్యప్రాచ్యంలోనే అతిపెద్ద సైనిక స్థావరమైన అల్ ఉదైద్ స్థావరం ఖాళీ చేయాల్సి రావడంతో అమెరికా ప్రభుత్వం గుర్రుగా ఉంది. గతేడాది అమెరికన్ సైన్యం ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసింది. సమయంలో ఇరాన్ ఈ స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ మరోసారి ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో అమెరికా తన సైన్యాన్ని, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నది. ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య దౌత్యపరమైన చర్చలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తమ సార్వభౌమత్వానికి భంగం కలిగితే చూస్తూ ఊరుకోబోమని తేల్చిప్పారు.
పకడ్బందీగా అమెరికా వ్యూహాలు
ఇరాన్ ఉద్రిక్తలపై ఇజ్రాయెల్‌తోపాటు ఇతర అరబ్ దేశాల ప్రతినిధులు ఎప్పటికప్పుడు అమెరికన్ ప్రభుత్వ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇరాన్ ప్రభుత్వం ప్రస్తుతం బలహీనంగా లేదని, ఇప్పుడే ఆ దేశంపై సైనిక దాడులు చేస్తే ఆశించిన ఫలితాలు రాకపోవచ్చని పలు అరబ్ దేశాలు స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే.. ట్రంప్ మాత్రం వాటిని లెక్కలోకి తీసుకోకుండా అన్ని రకాల ప్రత్యామ్నాయాలను సిద్ధం చేస్తున్నట్లు, ఇరాన్ లోని పలు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఎర్ఫాన్ సొల్తానీ అనే ౨౬ ఏళ్ల యువకుడికి ఇరాన్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. దేవుడి రాజ్యంపై తిరుగుబాటు చేశాడనే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై తదుపరి ప్రకటనైతే వెలువడలేదు.
భారతీయులు దేశం విడిచి రావాలి: ఇండియన్ ఎంబసీ
ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడి భారతీయు లంతా తక్షణం తమకు అందుబాటులో ఉన్న విమానాలు లేదా ఇతర మార్గాల ద్వారా దేశం విడిచి వెళ్లాలని ఇరాన్‌లోని ఇండియన్ ఎంబసీ, భార త విదేశాంగశాఖ హెచ్చరికలు జారీ చేశాయి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భారతీయులెవరూ ఇరాన్‌కు వెళ్లవద్దని సూచించాయి. నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించాయి.




