11 June, 2026 | 1:13 AM

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి వార్డు సభలు

11-06-2026 12:00 AM

ఇల్లందు, జూన్ 10 (విజయక్రాంతి):  ప్రజల గడప వద్దకే పాలనను తీసుకెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకొని సత్వర పరిష్కారానికి వార్డు సభలు దోహదపడతాయని 22వ వార్డు కౌన్సిలర్ కొర్లపాటి శివకిరణ్ అన్నారు. బుధవారం 22వ వార్డు వాటర్ ట్యాంక్ ఆవరణలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్డు సభలో పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కొర్లపాటి శివకిరణ్ మాట్లాడుతూ వార్డులో తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, వీధి దీపాల నిర్వహణ వంటి మౌలిక సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించామని, ప్రజల సూచనల మేరకు ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే (ఎస్‌ఐఆర్)పై అవగాహన కల్పిస్తూ ప్రతి కుటుంబం తమ వివరాలను సక్రమంగా నమోదు చేయించుకోవాలని సూచించారు. సభలో నూతన పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు, రేషన్ కార్డుల్లో పేర్ల మార్పులు, గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందగా వాటిని పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

మున్సిపల్ కమిషనర్ సందీప్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును నమోదు చేసి నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, వార్డు సభలను ప్రతి నెలా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అకౌంట్ ఆఫీసర్ జగదీశ్వరి, వార్డ్ ఆఫీసర్ రజిని, జీపీఓ వెంకటరమణ, ఆర్పీ మమత, అంగన్వాడీ టీచర్లు సక్కుబాయి, యాకమ్మ, కాంగ్రెస్ నాయకులు కోలపురి ఝాన్సీ, ఆలేటి చిన్ని, వార్డు పెద్దలు, యువకులు పాల్గొన్నారు.