ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద తాగునీటి ఏర్పాట్లు చేసిన జలమండలి
సికింద్రాబాద్, ఆగస్టు 2 (విజయ క్రాంతి): సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జలమండలి విస్తృత స్థాయిలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ ఏర్పాట్లు చేపట్టింది.ఈ సందర్భంగా భక్తుల కోసం 6 తాగునీటి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు, 8.50 లక్షల తాగునీటి సాచెట్లు, 25 వేల 250 మి.లీ. తాగునీటి బాటిళ్లు అందుబాటులో ఉంచింది.క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు తాగునీటిని నిరంతరం పంపిణీ చేసేందుకు 60 మంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమించింది. అవసరాన్ని బట్టి అదనపు ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేసేందుకు కూడా ఏర్పాట్లు చేసింది.
బోనాల ఉత్సవాల సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ప్రధాన రహదారులు, ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా సీవరేజీ ఓవర్ఫ్లోలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే దెబ్బతిన్న, ప్రమాదకర స్థితిలో ఉన్న మ్యాన్హోల్ మూతలను వెంటనే కొత్త వాటితో భర్తీ చేయాలని సూచించారు. సీవరేజ్ లైన్లలో ఏర్పడే అడ్డంకులను తక్షణమే తొలగించేందుకు అవసరమైన ప్రాంతాల్లో ఎయిర్టెక్ యంత్రాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
ఈ ఏర్పాట్లను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమన్వయంతో విధులు నిర్వర్తించాలని ఎండీ స్పష్టం చేశారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ ఏర్పాట్లను డైరెక్టర్ (ఆపరేషన్స్)-II ప్రభు, సంబంధిత సీజీఎం, జీఎం,డీజీఎంలు, మేనేజర్లతో కలిసి క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నారు.






