గురునగర్ కాలనీలో దొంగల హల్‌చల్
భవాని మాత ఆలయంలో హుండీ చోరీ
సంగారెడ్డి జిల్లా,సదాశివపేట, ఆగస్టు 8: సదాశివపేట పట్టణంలోని గురునగర్ కాలనీలో దొంగలు హల్‌చల్ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి భవాని మాత ఆలయంలోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు హుండీని ఎత్తుకెళ్లారు. ఆలయం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉన్నప్పటికీ వాటిని సైతం లెక్కచేయకుండా దొంగలు చోరీకి పాల్పడటంతో స్థానికంగా కలకలం రేగింది.
కాగా, గత వారం రోజుల క్రితం ఇదే గురునగర్ కాలనీలో పల్సర్ బైక్ సైతం చోరీకి గురైనట్లు స్థానికులు తెలిపారు. వరుస చోరీలతో కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో పోలీసుల గస్తీని పెంచి, చోరీలకు పాల్పడుతున్న దుండగులను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.భవాని మాత ఆలయంలో జరిగిన హుండీ చోరీపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.






