10 June, 2026 | 2:43 AM

జల చౌర్యం.. టు బీ కంటిన్యూడ్

10-06-2026 01:27 AM

పుష్కర కాలమైనా ఏపీది అదే దోపిడీ

  1. ప్రత్యేక రాష్ట్రంలోనూ తెలంగాణకు దక్కని న్యాయం 
  2. కృష్ణా జలాల్లో 34% వాటా ఉపయోగించుకోవడంలో విఫలం 
  3. కాంగ్రెస్ పాలనలో మరీ అధ్వానం
  4.   2025-26లో ఏపీకి 66 శాతం కేటాయింపులు 
  5.   10 శాతం ఎక్కువ ఏపీ వినియోగం
  6. నిమ్మకు నీరెత్తినట్టుగా తెలంగాణ ప్రభుత్వం
  7. భగ్గుమంటున్న తెలంగాణవాదులు

హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): నీళ్లు, నిధులు, నియామకాలు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు ఊపిరిలూదిన ప్రాథమిక నినాదాం. కానీ, ఆ నినాదాలు నినాదాలుగానే మిగిలిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం (12 ఏళ్లు) గడిచినా ఉమ్మడి ప్రాజెక్టుల నీటి వినియోగంలో నదీ జలాల వాటాల పంపకంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటి కీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. కృష్ణా జలాల్లో ఇరు రాష్ట్రాలకు వాటాల కేటాయింపులో అప్పటి ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించకపోవడంతో నష్టపోయామని మేధావులు, ఇంజినీర్లు, తెలంగాణ వాదులు అంటున్నారు.

కనీసం నిర్ణయించిన వాటాను సైతం ఉపయోగించుకో కుండా.. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు వత్తా సు పలుకుతుండటాన్ని వారు ఎత్తిచూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి ఇంకా దిగజారిందని, పక్క రాష్ట్రానికి గేట్లు బార్లా తెరవ డంతో.. వాటాను మించి ఉపయోగించుకుంటుందని తెలంగాణ ఇంజినీర్లు చెబు తున్నారు.  స్వరాష్ట్రంలోనూ జరుగుతున్న ఏపీ జల దోపిడీని పాలకులు చూసీ చూడనట్టుగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

66:34 నిష్పత్తిలో..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదట్లో ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కృష్ణా జలాలను 66:34 నిష్పత్తిలో వినియోగించుకోవాలి. అయితే ఈ ఒప్పందమే సరికాదని అందరూ అం టుంటే.. అసలు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారమైనా కృష్ణా జలాలను వినియోగించుకున్నారా అంటే.. అదీ లేదని అధికారిక గణాంకాలను చూస్తే అర్థం అవుతుంది. 

ఏటా సగటున 3 శాతం దోపిడీ

గడిచిన 12 ఏళ్లలో కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ వినియోగించిన మొత్తం శాతం 826.64 కాగా.. ప్రతి సంవత్సరం  సగటున 68.88 శాతం (ఏపీకి 66 శాతం వాటా) తరలిస్తోంది. అంటే సగటున ప్రతి సంవత్సరం సుమారు 3 శాతం నీటిని అదనంగా వాడుకుంటున్నట్టుగా చెప్పవచ్చు. తెలంగా ణ విషయానికి వచ్చేసరికి.. 12 ఏళ్లలో 374.36 శాతం.. అంటే ఏటా సగటున 31.19 శాతం జలాలను మాత్రమే వాడుకున్నది.

ఈ లెక్కన ప్రతి సంవత్సరం సగటున సుమారు 3 శాతం వరకు (తెలంగాణ వాటా 34 శాతం) కృష్ణా జలాలను తెలంగాణ నష్టపోయిందనే చెప్పవచ్చు. అంటే ఒక సంవత్సరంలో ఎంతమేర తెలంగాణ కృష్ణా నదీ జలాలను వాడుకోవాలో గడిచిన 12 ఏండ్ల లో అంతమేర నష్టపోయినట్టే. ఇది వందల టీఎంసీలలో ఉంటుంది.  

వాటాకు మించి ఒకేసారి వాడుకున్న తెలంగాణ

నిజానికి ప్రత్యేక తెలంగాణ వచ్చిందే.. నీళ్లు, నిధులు, నియామకాలలో దోపిడీ జరుతుందనే. అందుకే దశాబ్దాలుగా పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు. కానీ,ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ.. ఇంకా జల దోపిడీ కొనసాగుతూనే ఉందని మేధావులు, ఇంజనీర్లు, తెలంగాణీయులు భగ్గుమంటున్నారు. రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం (2014-15)లో తెలంగాణ తనకు కేటాయించిన వాటా (34 శాతం)లో కేవలం 30 శాతం మాత్రమే ఉపయోగించుకుంది.

కానీ, ఏపీ తనకు కేటాయించిన (66 శాతం) వాటాను మించి 69.92 శాతం జలాలను వినయోగించుకుంది. 2015-17 వరకు ఒకటి.. అర శాతం వరకు తగ్గింది. 2023-24లో ఎన్నికల ప్రభావం కారణంగా 34 శాతానికి మించి చరిత్రలో మొదటిసారిగా తెలంగాణ 36.34 శాతం జలాలను వియోగించుకోవడం ఇక రికార్డు. ఆ తరువాత కూడా కేటాయింపుల దరిదాపుల్లోకి కూడా తెలంగాణ రాలేదు. పుష్కర కాలంలో కేవలం ఒకే ఒకసారి వాటాను మించి కృష్ణా నదీ జలాలను తెలంగాణ ఉపయోగించుకుంది.  

కాంగ్రెస్ హయాంలో దారుణం

ఇక మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొంది.. పాలనా పగ్గాలు చేపట్టిన తరువాత.. పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. 2024-25లో 28.27 శాతం జలాలను మాత్రమే తెలంగాణ వినియోగించుకోగా.. ఏపీ మాత్రం 72.73 శాతం తరలించుకుపోయింది. ఇక ఎన్నడూ లేని విధంగా 2025-26లో ఇప్పటి వరకు కేవలం 25.10 శాతం మాత్రమే జలాలను తెలంగాణ వినయోగించుకుంటే.. పుష్కర కాలంలోనే అత్యధికంగా ఏపీ 74.90 శాతం జలాలను తరలించుకుపోవడం గమనార్హం. అంటే ఈ సంతవ్సరం వాటా (66శాతం) కంటే సుమారు 10 శాతం జలాలను అదనంగా తరలించుకుపోవడాన్ని తెలంగాణ మేధావులు, ఇంజనీర్లు, తెలంగాణీయులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.

మేల్కొనకపోతే ముప్పే

ఈ ఏడు ఎల్‌నినో ప్రభావం కారణంగా సాధారణ వర్షాలు సరిగ్గా కురవవని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇ ప్పటికే రిజర్వాయర్లలో జలా లు అడుగంటాయి. ఈ నేపథ్యంలో ఏపీ జలచౌర్యానికి అడ్డుకట్ట వేయాల్సిన కాంగ్రెస్ పార్టీ అలసత్వం వహిస్తుంద న్న విమర్శలున్నాయి. కాంగ్రెస్ పార్టీ పాలనా పగ్గాలు చేపట్టిన తరువాతనే ఏపీ అధ్యధికంగా జల దోపిడీ చేస్తుండటాన్ని తెలంగాణీయులు ఎత్తిచూపుతున్నారు.