హాయ్ ఫ్రెండ్స్ వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి కదా.. సరదాగా ఫ్యామీలితో కలిసి ఎంజాయ్ చేసేయండి. నిత్యం కురుస్తున్న వర్షాలతో ఎత్తున కొండప్రాంతాల పైనుంచి జాలువారుతున్న జలపాతాలు మన రాష్ట్రానికి మరింత అందాన్ని అద్దుతున్నాయి. ఈ నిండైన అందాల్ని పొదివి పట్టుకుని తెలంగాణకు మకుటాయమానంగా నిలుస్తున్న జలతరంగాలను ఆస్వాదించండి. జలపాతాలను సందర్శించడానికి సరైనా సమయం కూడా ఇదే.. మరెందుకు ఆలస్యం ఫ్యామీలితో కలిసి ఈ మూడు రోజులు చక్కగా ప్రకృతి అందాలను వీక్షించండి..!
మల్లెలతీర్థం
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో విస్తరించి ఉన్న దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో కనిపించే ఒక సుందర సహజ జలపాతం. 500 అడుగుల ఎత్తులో నుంచి కిందికి దూకే ఈ జలపాతం చూపరులకు కనువిందు చేస్తూ అలరిస్తున్నది.
భీముని పాదం
ఈ జలపాతం సహజ సిద్ధంగా ఏర్పడింది. ఇది మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని కొమ్ములవంచ పరిధి అటవీప్రాంతంలో పచ్చని ప్రకృతి మధ్యన నిరంతర జలధారలతో అలరిస్తున్నది. 70 అడుగుల ఎత్తు నుంచి దూకే జలధార పర్యాటకులను ఉల్లాసపరుస్తుంది.
బొగత
ఇది కొత్తగా ఏర్పడిన ములుగు జిల్లా, వాజేడు మండలంలోని బొగత గ్రామంలో ఉంది. బొగతను చీకులపల్లి ఫాల్స్ అనికూడా అంటారు. దట్టమైన పచ్చని అడవుల మధ్య, కొండకోనల నుంచి హోరెత్తే నీటి హొయలతో నిండిన జలపాతమిది.
గాయత్రి
గాయత్రి జలపాతాలు నిర్మల్ జిల్లాలో ఉన్న అనేక జలపాతాల్లోనివి. ఇవి జిల్లాలోని నేరడిగొండ మండలంలో ఉన్నాయి. సుమారు 70 మీటర్ల ఎత్తునున్న రాతికొండ నుంచి కిందకు జాలువారుతున్న ఈ జలపాత అందాలు చూసినవారిని మైమరపిస్తుంటాయి.
గుండాల
గుండాల జలపాతం మహబూబ్‌నగర్ జిల్లా, ఆత్మకూరు మండలంలోని గుండాల గ్రామ సమీపంలో ఉంది. ఇక్కడ ఎత్తున బండరాళ్ళపై నుంచి కృష్ణానది ప్రవహించడం వల్ల జలపాతం ఏర్పడింది. కృష్ణానది పడమటి దిశ నుంచి తూర్పువైపు ప్రవహిస్తూ జలపాతాన్ని సృష్టిస్తుంది. ఈ జలపాతం కేవలం వేసవి కాలంలో మాత్రమే కనిపిస్తుంది.
కుంటాల
ఇవి ఆదిలాబాద్ జిల్లాలోని సహ్యాద్రి పర్వత పంక్తుల్లో కడెం నదిపై కుంటాల గ్రామానికి సమీపంలోని అభయారణ్యంలో ఉంది. 45 మీటర్ల ఎత్తు నుంచి జలజల పారే నీళ్లు, ఆ చప్పుడు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. దట్టమైన అడవులలో, సహ్యాద్రి పర్వత శ్రేణిలో గోదావరికి ఉపనది అయిన కడెం నదిపై ఈ జలపాతం ఉంది.
అజలాపురం
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని అజలాపురంలో ఈ జలపాతం ఉంది. మొగలిపూల పరిమళం వెదజల్లుతున్నట్టుండే ఈ జలపాతం అందాలు చూడచక్కగా ఉంటాయి. సుమారు 2వేల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన కొండల మధ్య జలధారలు ప్రవహిస్తున్న తీరు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.
రాముని గుండాలు
పెద్దపల్లి జిల్లా రామగుండం మండలకేంద్రంలో ఈ జలపాతాలున్నాయి. త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాస కాలంలో ఈ కొండపై దాహార్తి తీర్చుకోవడం కోసం ఈ గుండాలు ఏర్పరిచినట్లు చెబుతారు. అందులో కొన్ని పాలగుండం, నేతిగుండం, భైరవగుండం, జీడిగుండం, ధర్మగుండం ఇలా 108 గుండాలను ఏర్పాటు చేసినట్లు కథనం ఉంది.