16 March, 2026 | 2:30 AM

వెల్ఫేర్ బోర్డు కావాలి

16-03-2026 01:03 AM
  1. హామీలను నెరవేర్చండి 
  2. తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గుంటి సామ్రాజ్యం 
  3. సంక్షేమ బోర్డుకు కృషి చేస్తాం 
  4. హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్‌పై సీఎంతో చర్చిస్తాం 
  5. మంత్రి సీతక్క హామీ 
  6. హనుమకొండలో ‘హమాలీ మహా గర్జన’ మహాసభ

హనుమకొండ/హనుమకొండ టౌన్, మార్చి 15 (విజయక్రాంతి): హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి, హామీలను నెరవేర్చాలని తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గుంటి సామ్రాజ్యం డిమాండ్ చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని హయగ్రీవ చారి గ్రౌండ్‌లో తెలంగాణ రాష్ట్ర హమాలీ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హమాలీ మహాగర్జన మహా సభ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హమాలీ కార్మికులు పాల్గొని తమ ఐక్యతను చాటుకున్నారు.

కార్యక్రమానికి ముందు హమాలీలు అంబేడ్కర్ జంక్షన్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీ ప్రారంభానికి ముందు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అంబేద్కర్ జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నగరంలోని ప్రధాన రహదారుల మీదుగా సాగి హయగ్రీవాచారి మైదానం వరకు చేరుకుంది.

ఈ సందర్భంగా తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గుంటి సామ్రాజ్యం, ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. హమాలీ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 2016లో హమాలీ వర్కర్స్ యూనియన్ హమాలీల సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడిందని, రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాలలో సంఘం పనిచేస్తుందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా హమాలీ కార్మికులు పనిచేస్తున్నారని, లోడింగ్ అన్ లోడింగ్ రంగంలో నిత్యం శ్రమ చేస్తూ సరుకుల రవాణాల్లో, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో హమాలీల పాత్ర కీలకమని అన్నారు. హమాలి కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్న విశ్వాసంతో గత రెండేళ్లుగా కార్మికులు ఎదురుచూస్తున్నారు చెప్పారు. కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. 

సంక్షేమ బోర్డుకు కృషి చేస్తాం: సీతక్క

హమాలీల సంక్షేమ బోర్డు కు కృషి చేయడంతో పాటు హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. రక్తాన్ని చెమటగా మార్చి కష్టాన్ని ఇష్టంగా చేసుకొని హమాలీలు జీవనం సాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మండల కేంద్రాల్లో హమాలీల సంఘాలకు భూమి కేటాయించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాల్లో పనిచేసే హమాలీలకు కూర్చునేందుకు కూడా స్థలం లేకపోవడం బాధాకరమని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి హమాలీల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కార్మికుడు తన కష్టంతో సంపాదించుకునే ఏకైక వ్యక్తి అని తెలిపారు. సమాజం అభివృద్ధి చెందడంలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. హమాలీల సమస్యలను తప్పకుండా అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారం దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిత్యం ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తున్నారని, ప్రజా ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి అండగా ఉంటుందని అన్నారు. హమాలీల సంక్షేమం కోసం తన వంతు సహాయంగా సిడిఎఫ్ నిధుల ద్వారా 20 లక్షల రూపాయలు విడుదల చేస్తానని ప్రకటించారు. కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు దృష్టిలో తీసుకెళ్లి హమాలీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం, శివకుమార్, రచయిత మిట్టపల్లి సురేందర్, గాయకులు సుక్క రాంనర్సయ్య, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.