25 July, 2026 | 12:56 AM

మోదీని కాపాడిన దక్షిణాది

05-06-2024 01:40 AM

హైదరాబాద్, జూన్ 4: లోక్‌సభ ఎన్నిక ల్లో బీజేపీ చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా మారింది. 400 సీట్లు గెలుస్తామని జబ్బలు చరుచుకొన్న ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కనీసం 300 సీట్లు కూడా చేరుకోలేకపోయింది. బీజేపీ సొంతంగా 243 సీట్లకే పరిమితమైంది. 2019 ఎన్నికల్లో 303 సీట్లు సాధించి సొంతంగా మెజారిటీ దక్కించుకొన్న ఆ పార్టీ ఈసారి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 సీట్లు కూడా పొందలేకపోయింది. ఇప్పుడు నరేంద్రమోదీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే బీహార్‌లో నితీశ్‌కుమార్, ఏపీ లో చంద్రబాబు మద్దతు తప్పనిసరైంది. బీజేపీ ఆ మాత్రం సీట్లు అయినా సాధించిందంటే అందుకు దక్షిణాది రాష్ట్రాలే కారణం. అందునా బీజేపీ మరింత లోతుల్లోకి పడిపోకుండా తెలుగు రాష్ట్రాలు కాపాడాయి. 

ఆ సీట్లే కీలకం 

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకొన్నది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను దాదాపు నిజం చేస్తూ తెలంగాణలో 8 సీట్లు గెలుచుకొన్నది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా 3 సీట్లు దక్కించుకొన్నది. కేంద్రంలో మెజారిటీ మార్కుకు దాదాపు 30 సీట్ల దూరంలో నిలిచిపోయిన ఆ పార్టీకి.. తెలుగు రాష్ట్రాల్లో సానుకూల ఫలితాలు రాకుండా ఉండి ఉంటే.. మరింత దూరంలోనే ఆగిపోయేది. 

దక్షిణాది నుంచి 4౦ సీట్లు

బీజేపీ గెలిచిన 243 సీట్లలో దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ (8), ఏపీ (3), కర్ణాటక (17), మహారాష్ట్ర (11), కేరళ (1) నుంచే 4౦ సీట్లు ఉన్నాయి. 2019లోనూ దక్షిణాదిలో ఓట్ల పరంగా అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ.. ఈసారి కూడా ఆ హోదాను నిలబెట్టుకొన్న ది. అయితే, గత ఎన్నికల్లో ఉత్తరాది రాష్ట్రా ల్లో ఆ పార్టీ హవా కొనసాగటంతో దక్షిణాది రాష్ట్రాల్లోని విజయాన్ని బీజేపీ పెద్దగా పట్టిం చుకోలేదు. మహారాష్ట్ర, కార్ణాటకలో 2019 లో బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో ఏకపక్ష విజ యం సాధించింది.

అయితే, ఈసారి బీజేపీకి సగానికి సగం సీట్లు తగ్గిపోయాయి. అయి నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా కీలకమే. ఈ రకంగా చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో వచ్చిన 41 సీట్లు బీజేపీకి ప్రాణాధారం వంటివని రాజకీయ పండితులు పేర్కొంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో మాదిరిగా ఇక్కడ కూడా బీజేపీకి ఎదురుగాలి వీచి ఉంటే.. ఆ పార్టీకి ఘోరమైన ఓటమి తప్పేది కాదని చెప్తున్నారు. కేరళలో పాగావేసేందుకు ఎప్పటి నుంచో తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ ఎట్టకేలకు బోణీ కొట్టింది. రాష్ట్రమంతా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ హవా కొనసాగినా.. ఒక్క చోట కాషాయ పార్టీ ఖాతా తెరిచింది. త్రిస్సూర్ బరిలో దిగిన నటుడు సురేశ్‌గోపీ విజయం సాధించారు.