23 July, 2026 | 2:43 AM

ప్రభుత్వాన్నిఏర్పాటు చేయబోం

06-06-2024 01:05 AM
ప్రతిపక్షంలోనే కూర్చుంటాం..
ఇండియా కూటమి నేతల నిర్ణయం
కూటమిలోకి ఇతర పార్టీలకు ఆహ్వానం
ప్రధాని మోదీ నైతికంగా, రాజకీయంగా ఓడిపోయారు
దేశ ప్రజలు మాకిచ్చిన మద్దతుకు రుణపడి ఉంటాం: మల్లికార్జున ఖర్గే

న్యూఢిల్లీ, జూన్ 5: కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాము ఎలాంటి ప్రయత్నాలు చేయబోమని ఇండియా కూటమి నేతలు ముక్త కంఠంతో స్పష్టం చేశారు. ఇండియా కూటమి నేతలు ప్రతిపక్షంలో కూర్చుంటామని తెలిపారు. బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు కీలక భేటీ అయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై కూటమి నేతలు ఈ సందర్భంగా చర్చించా రు. ఇండియా కూటమికి అపూర్వ మద్దతు ఇచ్చిన దేశ ప్రజలకు ఎంతో కృతజ్ఞతతో ఉంటామని తెలిపారు. విద్వేషపూరిత రాజకీయాలు చేసే అవినీతి బీజేపీకి దేశ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. 

ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయంగానే కాకుండా నైతికంగా కూడా ఓడిపోయారని విమర్శించారు. దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, ధనవంతులకు దోచిపెడుతున్న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు ఇదని పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలోని నియంతృత్వ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగి స్తామని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్ష ప్రకా రం సరైన సమయంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు సరైన అడుగులు వేస్తామని కూటమి నేతలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మోదీ నైతికంగా ఓడిపోయినప్పటికీ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించు కున్నారంటూ ఖర్గే ఎద్దేవా చేశారు.

కూటమిలోకి ఆహ్వానిస్తాం.. 

ఇండియా కూటమిలోకి ఇతర పార్టీలను కూడా ఆహ్వానిస్తున్నామని మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. భాతర రాజ్యాంగ పీఠికపై విశ్వాసం, దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం వంటి లక్ష్యాలకు కట్టుబడి ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ ఇండియా కూటమిలో చేరొచ్చని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి నేతలు కలిసికట్టుగా సమన్వయంతో బాగా పోరాడాయ ని ప్రశంసించారు. సమావేశానికి కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక, ఎన్సీపీ (ఎస్‌పీ) నుంచి శరద్ పవార్, డీఎంకే నుంచి స్టాలిన్, సీపీఎం నుంచి సీతారాం ఏచూరి, ఎస్పీ నుంచి అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నుంచి తేజస్వీ యాదవ్, టీఎంసీ నుంచి అభిషేక్ బెనర్జీ, సంజయ్ రౌత్ తదితరులు హాజరయ్యారు.