స్వల్ప తేడా.. భారీ మూల్యం
బీజేపీకి ఓట్లలో తగ్గింది 0.7 శాతమే
కానీ, 63 సీట్లు కోల్పోయింది
యూపీలోనూ మొరాయించిన డబుల్ ఇంజిన్
మహారాష్ట్ర, బీహార్‌లోనూ ఇదే పరిస్థితి
న్యూఢిల్లీ, జూన్ 5: ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ, గతంతో పోలిస్తే సీట్ల సంఖ్య భారీగా తగ్గింది. కానీ, ప్రజల మద్దతులో పెద్ద తేడా ఏం లేదు. 2019 ఎన్నికల్లో బీజేపీకి 37.3 శాతం ఓట్ షేర్ రాగా ఈ సారి 36.6 శాతం వచ్చింది. ఇందులో తేడా కేవలం 0.7 శాతం మాత్రమే. కానీ, సీట్లలో వచ్చిన తేడా 63. గతంలో రికార్డు స్థాయిలో సొంతంగా 303 స్థానాల్లో గెలుపొందిన కమలదళం ఇప్పుడు 240 స్థానాల్లో గెలిచి మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేకపోయింది. ఇందుకు విరుద్ధంగా కాంగ్రెస్ తన ఓట్ షేర్‌ను 19.5 శాతం నుంచి 21.2 శాతానికి మాత్రమే పెంచుకుని గతంతో పోలిస్తే 47 స్థానాలు అధికంగా గెలుచుకుంది. 2019లో 52 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో 99 స్థానాలను కైవసం చేసుకుంది.
చిన్న తేడాతో పెద్ద గ్యాప్
ఓట్ షేర్‌లో ఇంత చిన్న మార్పు సీట్ల లెక్కల్లో అంత భారీ నష్టాన్ని చేకూర్చడం ఆశ్చర్యమే. కానీ, జాతీయ స్థాయిలో ఓట్ షేర్ అనేది ఎక్కువగానే ఉంటుంది. కానీ, రాష్ట్రాలు, సీట్ల వారీగా చూస్తే వ్యత్యాసం అర్థమవుతుంది. ఉదాహరణకు తమిళనాడులో చూస్తే 2019లో బీజేపీకి 3.6 శాతం ఓట్లు దక్కాయి. ఈసారి 11.2 శాతానికి పెరిగింది. కానీ, ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. పంజాబ్‌లోనూ ఇదే మాదిరి జరిగింది. 9.6 శాతం నుంచి 18.6 శాతానికి ఓట్ షేర్ పెరిగినా గతంలో వచ్చిన రెండు సీట్లను కాపాడుకోలేకపోయింది బీజేపీ. బీహార్‌లో 3 శాతం తేడాతో 5 సీట్లు తగ్గగా, బెంగాల్‌లో 1.6 శాతం వైరుధ్యంతో 6 సీట్లు కోల్పోయింది. మరీ విచిత్రంగా మహారాష్ట్రంలో కేవలం 1.4% ఓట్ల తేడాతో ఏకంగా 13 సీట్లు కోల్పోయింది. కాంగ్రెస్‌కు ఇక్కడే లాభించింది. ఆ పార్టీ 0.8 శాతం ఎక్కువ ఓట్లు సాధించి మహారాష్ట్రలో అనూహ్యంగా 1 నుంచి 13స్థానాలను కైవసం చేసుకోగలిగింది.
మొరాయించిన డబుల్ ఇంజిన్
మోదీ హవా మొదలైన 2014 నుంచి కేంద్ర రాజకీయాల్లో ఎంతో ముఖ్యమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ ఆధిపత్యం ఆరంభమైంది. 80 లోక్‌సభ స్థానాలు కలిగి గేమ్ చేంజర్‌గా పిలిచే యూపీ బీజేపీ చేతుల్లోకి వచ్చేసింది. కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయంగా బలంగా నాటుకుపోయిన ఎస్పీ, బీఎస్‌పీలను కాదని బీజేపీ యూపీలో పాగా వేసింది. కానీ, 2014 తర్వాత ఈ రాష్ట్రంలో ప్రస్తుతం అతిపెద్ద ఓటమిని చవిచూసింది. ఓట్ షేర్ కూడా 50 శాతం నుంచి 41 శాతానికి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకో టగా ఉన్న యూపీలో ఆరు స్థానాల్లో గెలవడం హస్తానికి ఊరటనిచ్చిందనే చెప్పాలి. తన మిత్రపక్షమైన ఎస్పీ 37 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా నిలవడమూ కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అంశమే. అంతేకాకుండా గతంతో పోలిస్తే ఓట్ల శాతం 18.11 నుంచి 33.5 శాతానికి పెంచుకుంది.
బీఎస్పీ బలహీనపడటం..
2024 ఎన్నికల్లో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ఖాతా తెరవలేకపోయింది. 2014లో బీఎస్పీకి ఒక్క సీటు రాకపోయినా 2019లో ఎస్పీతో జతకట్టి తిరిగి పుంజుకుని 10 చోట్ల విజయం సాధించింది. ఎస్పీ 5 స్థానాల్లో గెలుపొందింది. ఈ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరి పోరాటం చేసింది. కానీ, ఒక్క సీటు గెలవలేకపోయింది. రిజర్వేషన్లు, రాజ్యాంగం, నిరుద్యోగ సమస్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగిన కాంగ్రెస్ ఎస్పీకి బీఎస్పీ బలహీనపడటమూ కలిసివచ్చిందని చెప్పాలి. ఫలితంగా బీఎస్పీ ఓట్లు కూటమికి మళ్లాయి. దీంతో యూపీలో ఇండియా కూటమి ఓట్ షేర్ 40 శాతానికి పెరిగింది.
యూపీలో ఓటమికి అనేక కారణాలు..
బీజేపీ అభిమానుల్లో ఇష్టమైన సీఎంగా యోగికి పేరుంది. కానీ, బీజేపీ మళ్లీ గెలిస్తే యోగిని తొలగిస్తుందని విపక్షాలు గందరగోళం సృష్టించాయి. దీన్ని తిప్పికొట్టడంలో బీజేపీ విఫలమైంది. దీనితో పాటు స్థానిక సమస్యలైన రైతులపై ఆర్థిక ఒత్తిడి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అగ్నిపథ్‌పై ప్రతిపక్షాల ప్రచారం బీజేపీకి వ్యతిరేకంగా పనిచేశాయి. ముఖ్యంగా యూపీలో మైనారిటీల సంఖ్య కూడా అధికంగానే ఉంటుం ది. వారి ఓట్లన్నీ విపక్షాలకే పడ్డట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సుమా రు 85 శాతం ముస్లింలు ఇండియా కూటమికి ఓట్లేయగా, 6 శాతం మాత్రమే కాషాయానికి అనుకూలంగా ఉన్నారు. రామమందిరాన్ని ప్రచారాస్త్రంగా చేసుకున్న బీజేపీ అయోధ్యలో ఓడిపోవడం జీర్ణించుకోలేకపోతోంది. అయోధ్య రామ మందిర ఉద్యమమే బీజేపీకి ప్రాణాధారంగా చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఎస్పీ అభ్యర్థి అవధేశ్ గెలుపొందా రు. దీంతో రామమందిర అంశం ఈ ఎన్నికల్లో తమకు ఉపయోగపడలేదని బీజేపీ అంచనా వేస్తోంది.






