కేజ్రీవాల్‌కు దక్కని ఊరట
బెయిల్ పొడిగింపును తిరస్కరించిన ఢిల్లీ కోర్టు
వైద్య అవసరాలు జైలు అధికారులే చూసుకోవాలని ఆదేశం
న్యూఢిల్లీ, జూన్ 5: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకునేందుకు బెయిల్‌ను పొడిగించాలని కేజ్రీవాల్ ఇంతకు ముందే కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు విన్న న్యాయస్థానం బుధవారానికి తీర్పును రిజర్వ్ చేసింది. కేజ్రీవాల్ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ తాజాగా ఆదేశాలనిచ్చింది. జ్యుడీషియల్ కస్టడీని జూన్ 19 వరకు పొడిగించింది. ఆయన వైద్య అవసరాలను జైలు అధికారులే పర్యవేక్షించాలని కోర్టు ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో పీఎంఎల్‌ఏ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. విచారణలో జాప్యం కారణంగా ఎన్నికల్లో ప్రచారం కోసం ఢిల్లీ కోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనను అంగీకరిస్తూ షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు తిరిగి జూన్ 2న తిహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు.






