30 April, 2026 | 3:36 AM

ప్రాణహిత-చేవెళ్లకు కట్టుబడి ఉన్నాం

30-04-2026 02:13 AM
  1. ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం
  2. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు
  3. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి) : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి, ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధంచేసినట్లు ఆయన వెల్లడించారు. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి ప్రత్యామ్నాయ మార్గాలతో పాటు మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం పునరుద్ధరణ పనులపై బుధవారం మంత్రి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

నీటి పారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఈ శ్రీధర్, సహాయ కార్యదర్శి కే శ్రీనివాస్, ఈఎన్సీ రమేష్ బాబు, జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రోహిత్ శర్మ, ఆర్వీ అసోసియేట్స్, ఐఐటీ హైదరాబాద్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించి లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందించేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నామన్నారు.

తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించేందుకుగానూ ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేయాలని ఆర్వీ అసోసియే ట్స్, ఐఐటీ హైదరాబాద్‌కు బాధ్యత అప్పగించామని తెలిపారు. వారు నాలుగు ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారని, ఆ ప్రతిపాదనలపై ప్రభు త్వం లోతుగా పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రతీ ప్రతిపాదనకు అయ్యే ఖర్చు అనుకూల, ప్రతీకూల పరిస్థితి లపై అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్నారు.

బుధవా రం రేవంత్‌రెడ్డితో జరగనున్న ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆ నాలుగు ప్రతిపాదనలపై సమీక్షించి తగు నిర్ణయం తీసుకొనున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం పునరుద్ధరణకు అవసరమైన పరీక్షలన్నింటినీ వర్షాకాలం ప్రారంభం లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో విధిగా నిబంధనలు పాటించాలని, ప్రతీ 1.5 మీటర్ల దూరంలో ఎస్‌పీటీ పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

ప్రతీ మూడు మీటర్ల దూరంలో పెర్మిబిలిటి టెస్ట్‌లు జరపాలని, బోర్లు వేస్తున్న సమయంలో రాయి వచ్చినా ఐదుమీటర్ల లోతు గా బోర్లు వేయాలన్నారు. బరాజ్ ల పునరుద్ధరణ కోసం నియమించిన సమన్వయ కమిటీ బరాజ్ లను సందర్శించిన టైంలైన్‌ను నిర్దేశించు కోవాలని అధికారులకు చెప్పారు.

సీడబ్ల్యూపీఆర్‌ఎస్ డైరెక్టర్ క్షేత్రస్థాయిలో ఉంటూ పునరుద్ధరణకు అవసరమైన పను లు త్వరితగతిన పూర్తియ్యేలా చూడాలన్నారు. అదే సమయంలో పునరుద్ధరణ కోసం జరుగుతున్న పరీక్షల పురోగతి పనుల వివరాలు ఎప్పటికప్పుడు ఎన్‌డీఎస్‌ఏకు నివేదించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ కార్యదర్శిని ఆదేశించారు.