గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
29-08-2026 01:35 AM
ప్రతి తండా అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
పెద్దమందడి, ఆగస్టు 28: గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, ఆత్మగౌరవానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పెద్దమందడి మండలం మంగంపల్లిలో నిర్వహించిన గిరిజనుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.
ఇల్లు లేని కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు, తండాలకు రహదారులు, తాగునీరు, విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. 32 తండా గ్రామపంచాయతీల్లో సేవాలాల్ మహారాజ్ ఆలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోడు భూముల సమస్యల పరిష్కారం, గిరిజన రైతులకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రతి తండా అభివృద్ధి చెందే వరకు నిరంతరం పనిచేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.






