18 March, 2026 | 2:16 AM

ప్రకృతి సాగును ప్రోత్సహిస్తున్నాం

18-03-2026 12:32 AM

వీసీలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలతో కలెక్టర్, అధికారులు

మంచిర్యాల/లక్షెట్టిపేట, మార్చి 17 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా రైతులను ప్రకృతి సాగు వైపు మళ్లిస్తూ, వారిని ప్రోత్సహిస్తున్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా జాతీయ మిషన్ ఫర్ ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన ఒక రోజు శిక్షణ  కార్యక్రమానికి జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేట రైతు వేదిక నుంచి జిల్లా వ్యవసాయాధికారిణి సురేఖ, ప్రకృతి వ్యవసాయ రైతు కొట్టే రవీందర్, ఇతర వ్యవసాయాధికారులతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలోని 15 రైతు వేదికలలో 1,875 మందితో వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ నిర్వహించామని, ప్రకృతి వ్యవసాయ పథకం పురోగతి దిశగా జిల్లాలో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఆత్మ చైర్మన్ సింగతి మురళీ, కార్పొరేటర్లు రాజన్న, బియ్యా ల త్రివేణి, కమల, లగిశెట్టి రాజయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వెంకట్రావుపేట పీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్

లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సరోజ తో కలిసి మంగళ వారం జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహె చ్సీలోని వార్డులు, రిజిస్టర్లు, మందుల నిల్వలు, పరిసరాలను పరిశీలించారు. అలాగే లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేటతో పాటు దౌడపల్లి,

చందారం గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. అనంతరం లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అమృత్ పథకం నీటి ట్యాంకుల నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్‌తో కలిసి పరిశీలించి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.