విధ్వంస రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం..
- అహంకారంతో విర్రవీగేవారికి ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పారు
కడప మహానాడు బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు
కడప, మే 29: ఇటుక, ఇటుక పేర్చుతూ విధ్వంస రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు తెలిపా రు. వైనాట్ గొడ్డలిపోట్లు అనేవి తమ విధానం కాదని, ప్రతిక్షణం కష్టపడి పనిచేయడమే తమ విధానమని, కష్టాలు, సవాళ్లు చూసి పారిపోలేదని, క్లుమైర్ మైన్లకే భయపడలేదని చెప్పారు. పేదల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే తన జీవిత ఆశయమని ఆయన పేర్కొన్నారు.
గురువారం కడపలో మూడోరోజు మహానాడు బహిరంగసభలో చంద్రబా బు కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవునిగడపలో తొలి మహానాడు సూపర్‌హిట్ అయ్యిందని చెప్పారు. టీడీపీ శ్రేణులతో కడప దిగ్భంధమైందని, కడప గడపలో మార్పు కనిపిస్తోందని, అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. వైసీపీకి రాయలసీమలో 7 సీట్లు వస్తే..కడప జిల్లాలోనే కూటమి 7 గెలిచిందన్నారు.
2029 ఎన్నికల్లో ఉమ్మడి కడపలో పదికి పది స్థానాలు గెలవాలన్నారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామన్నారు. డ్రగ్స్, గంజాయి అమ్మితే అదే చివరి రోజని, అడబిడ్డల జోలికి వస్తే అవే వారికి అంతిమగడియలు అని హెచ్చరించారు.
రాయలసీమను రాష్ట్రానికి మణిహారంగా మారుస్తామని, రాయలసీమ అభివృద్ధికి బ్లూప్రింట్ ఉందని, ఆరు నెలల్లో కడప హజ్‌హౌజ్ పూర్తిచేస్తామన్నారు. కర్నూలుకు హైకోర్టు బెంచ్ తప్పకుండా వస్తుందన్నారు. జూన్ 12లోగా రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించారు.




