11 August, 2026 | 6:32 PM

ఖర్చుల్లో మనమే టాప్!

19-06-2024 12:27 AM
  • అర్బన్ వినిమయ వ్యయంలో తెలంగాణ టాప్ 

పట్టణాల్లో రూ.8,158 వ్యయంతో దేశంలోనే మొదటిస్థానం

జాతీయ సగటు కంటే మెరుగైన గణాంకాలు నమోదు చేసిన రాష్ట్రం

కేంద్ర గణాంకాల శాఖ నివేదికలో వివరాలు వెల్లడి

హైదరాబాద్, జూన్ 18( విజయక్రాంతి) : నెలవారీ తలసరి వినియోగ వ్యయం( ఎంపీసీఈ)లో తెలంగాణ మెరుగైన సగటును సాధించింది. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజల ఖర్చు పెరిగినట్లు  తాజా అధ్యయం చెబుతోంది. వినిమయ వ్యయంలో జాతీయ సగటు కంటే.. రాష్ట్ర సగటు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. కేంద్ర గణాంకాలు, ప్రణాళిక మంత్రిత్వ శాఖ 2022 ఏడాదికి సంబంధించిన 18 కీలక రాష్ట్రాల ఎంపీసీఈ నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఇందులో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు దేనికోసం ఎక్కువ ఖర్చు చేశారు? వారి వ్యయం ఎలా ఉంది? వంటి కీలక అంశాలతో 11ఏళ్ల తర్వాత గణాంకాల శాఖ ఈ నివేదికను విడుదల చేసింది.

గ్రామీణ సగటులో ఆరోస్థానం

ఒక వ్యక్తి లేదా కుటుంబానికి సంబంధించిన నిర్దిష్ట కాల వ్యవధిలో వస్తువులు, సేవలపై ఎంత ఖర్చు చేస్తున్నారనే కొలమానాన్నే ఎంపీసీఈ అంటారు. నెలవారీ తలసరి వినియోగ వ్యయం జాతీయ సగటు గ్రామీణ భారతంలో రూ.3,773 కాగా.. పట్టణంలో రూ.6,459. అయితే తెలంగాణలో ఎంపీసీఈ జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. తెలంగాణ గ్రామీణ రూ.4802 కాగా.. పట్టణ సగటు రూ.8,158 కావడం గమనార్హం.

కేంద్ర గణాంకాల శాఖ నివేదిక ప్రకారం.. పట్టణంలో ఏ రాష్ట్రంలో కూడా వినిమయం వ్యయం సగటు రూ.8,158 లేకపోవడం విశేషం. అదే విధంగా గ్రామీణ సగ టు కేటగిరీలో కూడా రాష్ట్రం ఆరోస్థానంలో నిలిచింది. తెలంగాణ కంటే ముందు ఏపీ, కేరళ, హర్యానా, పంజాబ్, తమిళనాడు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల పట్టణ సగటు వ్య యం తెలంగాణ గ్రామీణ వ్యయం కంటే తక్కువగా  ఉండటం గమనార్హం.

తగ్గిన అసమానతలు కారణాలు

2011 ఏడాదికి సంబంధించిన గణాంకాలతో ఈ నివేదికను పోల్చినప్పుడు వ్యయంలో  అసమానతలు కొంత తగ్గినట్లు అధ్యయనం చెబుతోంది. రైతుల ఆదాయం పెరగడం, ప్రజలకు ప్రత్యక్షంగా నగదు బదిలీ చేయడం, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, అలాగే గ్రామాలు, పట్టాణాల్లో జీననోపాధి మెరుగుపడం వల్లే ప్రజలు ఖర్చు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని అధ్యయనం వెల్లడించింది. దీని వల్లే గతానికి, ఇప్పటికి వ్యయంలో అసమానతలు తగ్గినట్లు పేర్కొంది. 

గ్రామం, పట్టణం మధ్య భారీ వ్యత్యాసం

అయితే గ్రామాల్లో వ్యయానికి, పట్టణాల్లో ఖర్చుకు మాత్రం బాగా వ్యత్యాసం ఉన్నట్లు వెల్లడించింది. తెలంగాణలో పట్టణ, గ్రామీణ వినిమయ వ్యయం తేడా 70శాతం ఉన్నట్లు పేర్కొంది. ఈ జాబితాలో మాత్రం కేరళ కేవలం 19శాతం తేడాతో మొదటి స్థానంలో ఉండ టం విశేషం. మన పొరుగు రాష్ట్రం ఏపీలో గ్రామీణ, పట్టణాల మధ్య వినిమయ వ్యయం తేడా 39శాతం మాత్రమే. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారడమే ఈ వ్యత్యాసానికి కారణంగా తెలుస్తోంది.