11 August, 2026 | 5:22 PM

ఆర్నెళ్లు.. రూ.30వేల కోట్లు!

19-06-2024 12:32 AM
  • ఆర్‌బీఐలో తెలంగాణ అప్పుల ఖాతా

నెలకు రూ.3వేల కోట్లకు తగ్గకుండా రుణం

జూన్‌లో ఇప్పటికే రూ.4వేల కోట్లు స్వీకరణ

హైదరాబాద్, జూన్ 18 ( విజయక్రాంతి) : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 192రోజులు అవుతుంది. ఆరు నెలల్లోనే రాష్ట్ర సర్కారు దాదాపు రూ.30వేల కోట్ల అప్పులు చేసినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో కాంగెస్ పాలన డిసెంబర్ 9, 2023న ప్రారంభమైంది. డిసెంబర్ 12వ తేదీ నుంచి కొత్త ప్రభుత్వం అప్పులు తీసుకోవడం ప్రారంభించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నివేదికలు చెబుతున్నాయి. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు ప్రతీ నెల రూ.3వేల కోట్లకు తగ్గకుండా ప్రభుత్వం ఆర్బీఐ వద్ద అప్పు తీసుకుంటోంది.

ఈ ఆరు నెలల్లో గతేడాది డిసెంబర్‌లో కనిష్టంగా రూ.1400 కోట్లు తీసుకోగా గరిష్టంగా ఈ ఏడాది మార్చిలో రూ.7,718కోట్లు రుణంగా పొందింది. మార్చి నెలలో గరిష్టంగా నాలు గు సార్లు ఆర్బీఐ నిర్వహించిన వేలంలో పాల్గొనడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో ప్రభుత్వ సెక్యూరిటీలను చూపెట్టి ఆర్బీఐ వద్ద రూ.27,118కోట్లు అప్పుగా తీసుకుంది. మంగళవారం కూడా రూ.2వేల కోట్లు స్వీకరించింది. అలాగే, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం హౌసింగ్ అండ్ అర్బన్ కార్పొరేషన్( హడ్కో) నుంచి దాదాపు రూ.3వేల కోట్లు మార్చి నెలలో తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఆరు నెలల్లో మొత్తం అప్పులు రూ.30,118కోట్లకు చేరినట్లు గణాంకాలను చూస్తే అర్థమ వుతోంది. 

బీఆర్‌ఎస్ చేసిన అప్పుల వడ్డీలకే..

గతేడాది డిసెంబర్ 20వ తేదీ తెలంగాణ అప్పులపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా శ్వేత పత్రం విడుదల చేశారు. గత తొమ్మిదన్నరేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.5,99,099కోట్ల చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. నాడు బీఆర్‌ఎస్ చేసిన అప్పులకే వడ్డీలు కట్టేందుకు కాంగ్రెస్ సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. ఆ అప్పులకు వడ్డీలు కట్టేందుకే మళ్లీ రుణాలను తేవాల్సిన పరిస్థితి నెలకొంది.

రెవెన్యూ రాబడిలో రుణాలకు చెల్లించాల్సిన వడ్డీలు 34శాతం ఉన్నాయంటే.. ఆర్థిక భారం ప్రభుత్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే భారం అని తెలిసినా.. అప్పు చేయడం తప్పా మరో మార్గం లేదని ప్రభు త్వ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి అప్పులు చెల్లించే వడ్డీలు ఏడాదికేడాది పెరుగుతున్నాయే కానీ, ఏ మాత్రం తగ్గడం. 2015లో వడ్డీలను రూ.10 వేల కోట్ల వరకు చెల్లించిన ప్రభుత్వం.. 2023 నాటికి అది రూ.60వేల కోట్లకు చేరిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది వడ్డీలు మరింత పెరిగే అవకాశం ఉంది. 

వడ్డీలను తగ్గించుకోవడంపై దృష్టి..

రాబడిలో భారీ మొత్తం వడ్డీలకే చెల్లిస్తున్న నేపథ్యంలో అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. అప్పులను సవరించుకోవాలని చూస్తోంది. కొన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ మొత్తం వడ్డీలకు అప్పులను ఇచ్చాయి. అయితే ఇప్పుడు ఆ  అప్పులను తక్కువు వడ్డీలు ఇచ్చే సంస్థలు, బ్యాంకులకు బదిలీ చేసుకోవడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.