ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించాల్సిందే
- పారిశుద్ధ్య నిర్వహణలో అలక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
- నగరంలో జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ కమిషనర్ల తనిఖీలు
హైదరాబాద్‌సిటీ బ్యూరో, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే దిశగా మున్సిపల్ యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది. పారిశుద్ధ్య నిర్వహణలో క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించేది లేదని ఉన్నతాధికారులు తేల్చిచెబుతున్నారు. నగరంలో ప్రతిరోజూ తప్పనిసరిగా డోర్-టు-డోర్ ఇంటింటి చెత్త సేకరణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు.
బుధవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, ఎంఎంసీ కమిషనర్ టి వినయ్ కృష్ణారెడ్డి నగరంలోని పలు ప్రాంతాల్లో వేర్వేరుగా ఆకస్మిక క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టారు. స్వచ్ఛ ఆటోల హాజ రు, పారిశుద్ధ్య కార్మికుల పనితీరును స్వ యంగా పర్యవేక్షించి, ప్రణాళికాబద్ధంగా చెత్త సేకరణ జరగాలని క్షేత్రస్థాయి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ జోనల్ కమిషనర్ రవికిరణ్‌తో కలిసి విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇందిరాపార్క్, గాంధీనగర్ డివిజన్ నుంచి మొదలుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు.
మార్గమధ్యలో సురభి పార్క్, పీఅండ్‌టీ కాలనీ, కవాడిగూడ తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో స్వచ్ఛ ఆటోల హాజరు, దైనందిన పారిశుద్ధ్య కార్యకలాపాలను ఆయన పరిశీలించారు. అలాగే ఎంఎంసీ కమిషనర్ టి వినయ్ కృష్ణారెడ్డి సైతం కాప్రా సర్కిల్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఓల్డ్ కాప్రా, డాబా గార్డెన్స్, ఎల్లారెడ్డిగూడ ప్రాం తాల్లో ఉదయాన్నే పర్యటించి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు.
సాకేత్ రోడ్డులోని సెకండరీ కలెక్షన్ పాయింట్‌నుప్రత్యేకంగా సందర్శించిన ఆయన.. నగరంలో వీలైనన్ని ఎక్కువ సెకండరీ కలెక్షన్ పాయింట్లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఓల్డ్ కాప్రాలోని స్థానిక కాలనీ వాసులతో ముఖాముఖిగా మాట్లాడుతూ పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు.




