calender_icon.png 20 February, 2026 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐని మనమే.. శాసించాలి

20-02-2026 01:07:24 AM

ఏఐ మనల్ని శాసించకూడదు..

ఇండియా ఇంపాక్ట్ ఏఐ సమ్మిట్‌లో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౧౯: ‘కృత్రిమ మేధ(ఏఐ)ను మనం శాసించాలే కానీ, ఏఐ మనల్ని శాసించకూడదు.. ఏఐ మానవ కేంద్రిత సమ్మిళిత అభివృద్ధికి సాధనంగా మారాలి’ అని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతి ష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియా ఇంపాక్ట్ ఏఐ సదస్సుకు గురువారం నాలుగోరోజు ప్రధాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐ వ్యవస్థలు ‘మానవ్’ (M.A.N.A.V) మంత్రం పాటించాలని ప్రధాని సూచించారు.

‘మానవ్’ సూత్రా న్ని వివరిస్తూ.. ఏఐ వ్యవస్థలు జవాబుదారీతనం, నైతిక విలువలతో ఏఐ వ్యవస్థలు పనిచేయాలని సూచించారు. ఒక దేశం డాటాను ఆ దేశానికే పరిమితం చేయాలని పిలుపునిచ్చారు. గుత్తాధిపత్యంతో పని చేయొద్దని, అన్ని సంస్థలకు అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. ఏఐ పనితీరు చట్టబద్ధంగా ఉండి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ ఐదు సూత్రాలకు కట్టుబడి సంస్థలు కార్యాచరణ ఉండాలన్నారు.

మేకిన్ ఇండియా, భారత ఆవిష్కరణ సామర్థ్యాన్ని సదస్సు చాటుతోందని పేర్కొన్నారు. ప్రపంచ జనాభాలో ఆరోవంతు జనాభా భారత్‌లోనే ఉందని, దేశ ప్రజలు ఇప్పుడు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారని వివరించారు. ఏఐని ఉపయోగించుకు నేందుకు యువత ఆసక్తి కనబరుస్తోందని పేర్కొన్నారు. ఏఐకి పరివర్తన శక్తి ఉందని, దాని దుర్వినియోగం చేస్తే విధ్వంసానికి దారితీస్తుందని హెచ్చరించారు.

సద్వినియోగం చేసుకుంటే మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఏఐ ఏం చేయగలదో కాదని, ఇప్పుడు ఏఐని ఉపయోగించి, మనం ఏం చేయగలమనేదే ప్రశ్న అని పేర్కొన్నారు. ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ మాట్లాడుతూ.. సాంకేతికత వినియోగంలో భారత్ అద్భుతమైన పురోగతి సాధిస్తోందని కొనియాడారు.

భారత్ భవిష్యత్తులో అతిపెద్ద ఏఐ మార్కెట్ కాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఏఐ విప్లవాత్మక మార్పులు తె స్తుందని అంచనా వేశారు. ఇలాంటి మార్పు లు కొన్ని కంపెనీలకు ఇబ్బంది కలిగించినా, మరెన్నో సంస్థలకు కొత్త అవకాశాలను ఇస్తుందని అభిప్రాయడపడ్డారు.

ప్రధాని ప్రతిపాదించిన ‘మానవ్’ మంత్రం

* ఎం(M) - మోరల్ అండ్ ఎథికల్ సిస్టమ్: ఏఐ సంస్థలు నైతిక విలువలు పాటించాలి. 

* ఏ (A) - అకౌంటబుల్: పారదర్శక నిబంధనలు, జవాబుదారీతనంతో ఏఐ వ్యవస్థలు పనిచేయాలి.

* ఎన్ (N ) - నేషనల్ సావర్నిటీ: ఒక దేశంలో సృష్టించిన డేటా.. ఆ దేశానికే చెందాలి

* ఏ(A ) - యాక్సెసిబుల్ అండ్ ఇంక్లూజివ్: గుత్తాధిపత్యంతో పని చేయొద్దు.. 

అన్ని సంస్థలకు అందుబాటులో ఉండాలి.

వీ (V) - వేలిడ్ అండ్ లెజిటిమేట్: చట్టబద్ధంగా, విశ్వసనీయమైనదిగా పనిచేయాలి.