19 May, 2026 | 3:19 AM

జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలి

19-05-2026 12:08 AM

సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలి

అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి

బ్యాంకర్లు రుణ లక్ష్యాలను చేరుకోవాలి.

దిశ సమావేశంలో ఎంపీ మల్లు రవి

గద్వాల, మే 18 (విజయక్రాంతి): సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ చేరేలా జిల్లా అభివృద్ధికి సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసికట్టుగా కృషి చేయాలని నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు మల్లు రవి అన్నారు. జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశాన్ని సోమవారం ఐడిఓసి సమావేశపు మందిరంలో నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, పలువురు ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఎంపీ మల్లురవి వివిధ శాఖల అధికారులు ఇచ్చిన గణాంకాల నివేదిక ప్రకారం వారి పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో అమలు చేయకపోతే ప్రయోజనం ఉండదన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చేరాలని, అధికారులు పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. ఆయా బ్యాంకులకు నిర్దేశించిన వ్యవసాయ, అనుబంధ రంగాలు, ఇతర రుణ లక్ష్యాలను వంద శాతం చేరుకోవాలని ఆదేశించారు. పీఎం సురక్ష బీమా యోజన, పీఎం ఈజీపి, తదితర పథకాలకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. వివిధ సంక్షేమ వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న సీట్లను అర్హులైన విద్యార్థులతో భర్తీ చేయాలన్నారు.

వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏటా నిర్దేశించిన లక్ష్యం మేరకు నాటిన మొక్కల్లో ఎన్ని మొక్కలు బతికాయో నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నందున గద్వాల బ్రాండ్ ను కాపాడేందుకు మార్కెటింగ్ అవకాశాలను పెంచాలన్నారు. వివిధ క్లస్టర్ల ద్వారా చేనేత కార్మికులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలన్నారు.

ఆయా శాఖల్లో అభివృద్ధి పనులకు మంజూరైన నిధులు సద్వినియోగం అయ్యేలా సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని ఈ సందర్భంగా ఎంపీ పిలుపునిచ్చారు. సమావేశానికి గైర్హాజరైన పలువురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అలంపూర్ శాసనసభ్యులు విజేయుడు, గద్వాల, వడ్డేపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్స్ జయలక్ష్మి, మంజుల, అదనపు కలెక్టర్ నర్సింగరావు, డిఆర్డిఓ ముషాహిదా బేగం, దిశ కమిటీ సభ్యులు రాజు, గిరిబాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు