08-01-2026 05:11:58 PM
జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): దివ్యాంగుల కొరకు నిర్వహిస్తున్న సదరం శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న దివ్యాంగుల నిర్ధారణ సదరం శిబిరాన్ని ఆకస్మికంగా సందర్శించి శిబిరం నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సదరం శిబిరానికి హాజరయ్యే దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని, సదరం ధ్రువీకరణ పత్రాల జారీలో పారదర్శకంగా వ్యవహరించాలని, అర్హత కలిగిన దివ్యాంగులకు ధ్రువపత్రాలను అందించాలని తెలిపారు.
సదరం శిబిరానికి వచ్చే దివ్యాంగులు, వారి సహాయకులకు త్రాగునీరు, నీడ, కూర్చునేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని, మీ సేవా కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకున్న వారికి ఆలస్యం కాకుండా నిర్ణీత సమయంలోనే పరీక్షలు పూర్తి చేయాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని వివిధ విభాగాలను సందర్శించి వైద్యులకు పలు సూచనలు చేశారు. వివిధ అనారోగ్య సమస్యలపై ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రిలో అవసరమైన మందుల నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని తెలిపారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి అప్పల రాము, ఆసుపత్రి ఆర్ఎంఓ, ఎస్ ఓ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.