భద్రకాళి ఆలయానికి మహా వైభవం తెస్తాం
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
వరంగల్, మార్చి 13 (విజయక్రాంతి): వరంగల్ చారిత్రక శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మహా వైభవంగా తీర్చిదిద్దుతామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. 16.10 కోట్లతో చేపట్టనున్న భద్రకాళి చెరువులో పూడిక తీత పనులను శుక్రవారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి ప్రారంభించారు. మే 15 లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా భద్రకాళి సుందరీకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. భద్రకాళి ఆలయాన్ని జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని , వరంగల్ నగర అభివృద్ధిలో కీలకమైన భద్రకాళి చెరువు పునరుద్ధరణ చేసి మరో పర్యాటక కేంద్రం గా తీర్చిదిద్దడానికి శ్రీకారం చుట్టామని, గతంలో రూ. 9 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన పూడికతీత పనులు పూర్తి స్థాయిలో జరగకపోవడంతో ప్రస్తుతం రూ.16.10 కోట్ల నిధులతో సమగ్రంగా చెరువు పూడికతీత పనులను చేపడుతున్నామని అమ్మవారి ఆశీస్సులతో ఎలాంటి అవాంతరాలు లేకుండా చెరువు పునరుద్ధరణ, మాఢ వీధుల నిర్మాణ పనులు చేపడుతున్నామని,అభివృద్ధి పనులలో ఎక్కడ రాజీ పడడం లేదని,సమష్టి నాయకత్వంతో వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు.
భద్రకాళి చెరువు సుందరీకరణ ప్రక్రియలో భాగంగా ఆలయం నుంచి బండ్ వైపు గ్లాస్ వంతెన ఏర్పాటు చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, దేశం నలుమూలల నుండి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ ప్రాంతాన్ని ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, గతంలో 70 ఏళ్ల క్రితం పూడికతీత పనులు జరిగాయని గుర్తు చేసిన ఎమ్మెల్యే, భద్రకాళి చెరువు పునరుద్ధరణ పనులు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరగడం తాను ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పూడిక తీత పనులను మే 15 లోగా సుమారు 7 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తీత పనులను పూర్తి చేయాలని ఆధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, మామిండ్ల రాజు, ఇరిగేషన్ ఎస్ ఈ రాంప్రసాద్, ఈఈ కిరణ్ కుమార్, కుడా ఈఈ భీమ్ రావు, ఇరిగేషన్ డిఈ మధుసూదన్, ఏఈ లు వేణు గోపాల్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.




