తాడ్వాయి బస్టాండ్‌కు మరమ్మతులు నిర్వహిస్తాం..
బస్సులు లోపలికి వచ్చేలా చర్యలు..
తాడ్వాయి,జూలై, 20( విజయ క్రాంతి): తాడువాయి బస్టాండుకు మరమ్మతులు నిర్వహిస్తామని కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్ కుమార్ తెలిపారు. విజయ క్రాంతి దినపత్రికలో శనివారం ప్రచురితమైన శిథిల దశలో తాడ్వాయి బస్టాండ్ అనే కథనానికి ఆర్టీసీ అధికారులు స్పందించారు.ఈ విషయమై అధికారులతో కలిసి ఆర్టీసీ డిఎం సోమవారం కామారెడ్డి జిల్లా తాడువాయి మండల కేంద్రంలోని బస్టాండు ను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బస్టాండ్ పైకప్పు పెచ్చులూడుతుందని పైకప్పుకు మరమ్మతులు నిర్వహిస్తామని తెలిపారు. బస్టాండ్ ఆవరణ అంతా చెత్తాచెదారంతో నిండిపోయి ఉందని వెంటనే శుభ్రపరచడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
బస్టాండ్ లో ప్రయాణికులు కూర్చోవడానికి సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఆవరణలోని చిన్నచిన్న ముళ్ళ పొదలను తొలగించి శుభ్రపరుస్తామన్నారు. బస్టాండ్ ఆవరణ లో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చేస్తామన్నారు. ఆవరణలో ఉన్న మరుగుదొడ్లను శుభ్రం చేయిస్తామన్నారు.బస్సులు బస్టాండ్ లోపలికి వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సివిల్ ఏఈ సూర్య, హెడ్ కానిస్టేబుల్ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.






