20 April, 2026 | 3:27 AM

పటాకుల పరిశ్రమలో పేలుడు

20-04-2026 01:32 AM

అక్కడికక్కడే 23 మంది మృతి

తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఘటన

ఆరుగురికి తీవ్రగాయాలు.. స్థానిక ఆసుపత్రులకు తరలింపు 

క్షతగాత్రుల పరిస్థితి విషమం

మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం: సీఎం స్టాలిన్

చెన్నై, ఏప్రిల్ 19: తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. కట్టణార్‌పట్టిలోని ఒక పటాకుల తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంలో 23 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా క్షతగాత్రులయ్యారు.

పేలుడు ధాటికి ఫ్యాక్టరీ భవనం పూర్తిగా ధ్వంసమైంది. కార్మికుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.

మంత్రులు రామచంద్రన్, తంగం తెన్నరసును ఘటనా స్థలానికి పరిస్థితులను సమీక్షించారు. బాధితులకు తక్షణ సాయం అందించేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే, ప్రమాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా స్పందించారు. ప్రమాదం తనను కలచివేసిందని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిం చారు. మరోవైపు, ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫ్యాక్టరీలో భద్రతా నిబంధనల అమలుపై విచారణ జరుపుతున్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఎంతమంది ఉన్నారనే వివరాలను సేకరిస్తున్నారు. ఫ్యాక్టరీలో నిల్వ చేసిన రసాయన పదార్థాలకు నిప్పంటుకునే ప్రమాదం సంభవించిందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.