calender_icon.png 6 December, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీని ఢీకొడతాం!

06-12-2025 12:42:17 AM

  1. ఖర్చు చేయకండి.. ప్రజల మనసులు గెల్చుకోండి 
  2. గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేసే వారినే సర్పంచులుగా ఎన్నుకోండి 
  3. ఆడబిడ్డలందరికీ చీరలు పంపిణీ చేస్తాం 
  4. హైదరాబాద్‌లా వరంగల్‌ను తీర్చి దిద్దుతాం 
  5. మార్చి 31లోగా వరంగల్ ఎయిర్ పోర్టు పనులు షురూ 
  6. వరంగల్ జిల్లా నర్సంపేట సభలో సీఎం రేవంత్‌రెడ్డి

మహబూబాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): ‘ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేయవద్దని, ప్రజల మనసులు గెల్చుకోవాలని, గ్రామ సమస్యలపై అవగాహన పెంచుకోవాలని, అభివృద్ధి చేసుకోవాలని పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో రాజకీయ కక్షలకు తావు ఇవ్వొద్దని, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పని చేయించుకునే వారినే సర్పంచులుగా ఎన్నుకోవాలని, మంచి వారినే స్థానిక ఎన్నికల్లో గెలిపించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

‘మీరు అండగా ఉంటే ఢిల్లీనైనా ఢీకొడతాం, కేంద్రంతో కొట్లాడి రాష్ట్రా నికి రావాల్సిన నిధులు తీసుకొస్తాం’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ పరిధిలో సుమా రు రూ.532 కోట్ల అభివృద్ధి పనులకు శుక్రవారం సీఎం శంకుస్థాపన చేశారు.

అనం తరం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎప్పుడు వచ్చినా.. కాకతీయు లు, సమ్మక్క- సారక్క, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి కనిపిస్తుందన్నారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ నాయకులు నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. 

ధాన్యాగారంగా తెలంగాణ 

వరుసగా మూడేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిస్తూ భారతదేశంలో తెలంగాణ ధాన్యాగారంగా నిలుస్తోందని సీఎం అన్నారు. గత ప్రభుత్వంలో వరి వేస్తే ఉరి వేసుకోవడమేనని ప్రచారం చేశారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, సన్న ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం వల్లే ఇవాళ పరిస్థితి తారు మారయిందని అన్నారు.

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అంది స్తున్నామని, తొమ్మిది రోజుల్లో రూ. 9 వేల కోట్లు రైతు భరోసా అందించామని, 25 లక్షల 35 వేల మంది రైతులకు రూ. 20 లక్షల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిదన్నారు. దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వాలంటే వాళ్ల ఆస్తులు రాసిచ్చినట్లు మాట్లాడారన్నా రు. ప్రజా ప్రభుత్వంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నామని, రాష్ట్రంలో 3 కోట్ల 10 లక్షల మంది బిడ్డలకు ఏడాదికి రూ.13 వేల కోట్లు భారమైనా పేదవాడి ఆకలి తీర్చాలని సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. 

హైదరాబాద్ నగరంలా వరంగల్ 

హైదరాబాద్ నగరంలా వరంగల్‌ను తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. వరంగల్‌కు ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎయిర్ పోర్టు నిర్మిస్తామని, మార్చి 31 లోగా వరంగల్ ఎయిర్ పోర్టు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఔటర్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేస్తామన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతీ ఆడబిడ్డకు చీర చేరాల్సిందేనని, అందరికీ చీరలు చేరేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాలన్నారు.

చదువుకున్న వాడే గుణవంతుడు, ధనవంతుడని, చదువొక్కటే మన జీవితంలో మార్పు తీసుకొస్తుందన్నారు. అందుకే మీ పిల్లలను చదివించండి.. మీ పిల్లల చదువుకు కావాల్సిన వసతులు అందించే బాధ్యత నాది అని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. 40 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేస్తామున్నారు.

ఈ కార్య క్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, విప్ డాక్టర్ జాటోత్ రామ చంద్రునాయక్, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి రియాజ్, ఎంపి బలరాం నాయక్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్ నాగరాజు, డాక్టర్ మురళి నాయక్, రేవూరి ప్రకాష్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలు పేదలకు అందాలి

సంక్షేమ పథకాలు పేదలకు అందాలన్నదే మా ప్రయత్నమని, 2004 నుంచి 2014 వరకు వైఎస్ హయాంలో పదేళ్లలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని, ఇప్పుడు 22,500 కోట్లతో ప్రతీ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. నర్సంపేటకు మరో 3,500 ఇండ్లు మంజూరు చేసే బాధ్యత మంత్రి పొంగులేటికి అప్పగిస్తున్నామన్నారు. కమ్యూనికేషన్ ఇన్ పోరట్స్, క మ్యూనికేషన్ ఇన్ టెక్నాలజీ అని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించబోతున్నామని చెప్పారు.