10 July, 2026 | 8:56 PM

Breaking News

తెలంగాణ ఉద్యమం తరహాలో... డంపింగ్ యార్డ్ ఉద్యమం ఉధృతం చేస్తాం

10-07-2026 08:00 PM

డంపింగ్ యార్డ్ ఉద్యమం ఉధృతం చేస్తాం

డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ షేక్షావలి

జవహర్ నగర్,(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమం తరహాలో డంపింగ్ యార్డ్ ఉద్యమాన్ని ఉధృతం చేద్దామని డంపింగ్ యార్డ్ ప్రాంత ప్రజలంతా ఏకమై రాంకీ యాజమాన్యం ఆగడాలపై పోరాడదాం అని డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ షేక్షావలి పిలుపునిచ్చారు. ప్రజల జీవన ప్రమాణాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తొలగించే లక్ష్యంగా ముందుకు సాగుతూ శుక్రవారం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి యాప్రాల్ లో సీఎంఎస్ జయక్క ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా షేక్షావలి, ఉమా మహేష్ హాజరై మాట్లాడుతూ... చెత్తను జవహర్ నగర్ కే కాకుండా నలువైపులా ఉన్న డంపింగ్ యార్డులకు తరలించి డంపింగ్ యార్డ్ రహిత సమాజాన్ని నిర్మించాలని అన్నారు.

డంపింగ్ యార్డ్ పోరాటాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తూ ప్రజల భాగస్వామ్యంతో డంపింగ్ యార్డ్ ఎత్తివేసే వరకు ఉద్యమం ఆపమని  రాంకీ యాజమాన్యం నిబంధనలు పాటించకుండా ప్రజల ఆరోగ్యం దెబ్బతీస్తుండడం నేరమని ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకొని డంపింగ్ యార్డ్ ను మూసి వేయించాలని డిమాండ్ చేశారు. నేటి లారీల బంద్ కార్యక్రమానికి ప్రజలంతా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ యాప్రాల్ చైర్మన్ గా నరసింహ కన్వీనర్ గా సాయికుమార్ ను నియమించారు. ఈ కార్యక్రమంలో తోటపల్లి శంకర్, సునీత, చంద్రమౌళి, సావిత్రి, నరసింహ గౌడ్, వెంకటాచారి, కె. వేణు తదితరులు పాల్గొన్నారు.