1 June, 2026 | 12:57 AM

దేవుళ్లు, మతాల పేరిట రాజకీయం చేయం

01-06-2026 12:26 AM
  1. అన్ని మతాల ఆత్మగౌరవ పరిరక్షణే ప్రజా ప్రభుత్వ విధి
  2. రూ.3.30 కోట్లతో కూసుమంచి గణపేశ్వరాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి 
  3. పుష్కరాల నాటికి భద్రాద్రి పనులు పూర్తి అవుతాయని వెల్లడి  

కూసుమంచి, మే 31(విజయక్రాంతి) : దేవుళ్లు, మతాల పేరిట రాజకీయం చేయడం తమ ప్రభుత్వ విధానం కాదని, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ మత సామర స్యానికి ప్రతీకగా నిలవడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.  కూసు మంచి మండల కేంద్రంలోని చారిత్రాత్మక శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం (గణపేశ్వరాలయం) పునర్నిర్మాణ, అభివృద్ధి పనులకు రూ.3.30 కోట్ల వ్యయంతో ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు.

ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.లతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రతి మతం ఆత్మగౌరవాన్ని, సంస్కృతిని కాపాడుతామని.. దేవాలయాలతో పాటు చర్చిలు, మసీదుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. ఇటీవల సమ్మక్క-సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించడమే ఇందుకు నిదర్శనమన్నారు.

గత ప్రభుత్వం భద్రాచలం ఆలయ అభివృద్ధికి వంద కోట్లు ఇస్తామని ప్రకటించి.. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మోసం చేసిందని మంత్రి విమర్శించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి ఆలయ సమగ్ర రూపురేఖలు మార్చేందుకు రూ.350 కోట్లు కేటాయించి పనులకు శంకుస్థాపన చేశారని, వారం పది రోజుల్లోనే పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. ఆలయ పరిసరాల్లో భూసేకరణ కోసమే ఇప్పటికే రూ.68 కోట్లు ఖర్చు చేశామన్నారు.

రాబోయే గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలోని పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.1,000 కోట్లు మంజూరు చేసిందని, అందులో భాగంగానే గణపేశ్వరాలయ పనులను చేపట్టామన్నారు.  రాష్ట్ర ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, దేవాదాయ శాఖ అధికారులు, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ సైదులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అర్చకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు  పాల్గొన్నారు.

నేటి నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ప్రజా ప్రభుత్వం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం, మే 31(విజయక్రాంతి) : ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా చేసుకుని ముందుకు సాగుతోందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామంలో రూ.5.20 కోట్ల వ్యయంతో పొన్నెకల్లు నుండి కొండాపురం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ లతో కలిసి ఆయన ఈ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.

ఆర్థిక ఇబ్బందులున్నా హామీల అమలు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేయడం లేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూనే, రాష్ట్రవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రహదారుల నిర్మాణం ద్వారా ప్రజల రాకపోకలు సులభతరం కావడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఎంతో ఉపయోగపడుతుందని, కొండాపురంపొన్నెకల్లు రోడ్డు పూర్తయితే ఈ ప్రాంత రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

నేటి నుంచే రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లు

పేదలకు పక్కా గృహాలు అందించే ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత మంజూరు ప్రక్రియ జూన్ 1 (సోమవారం) నుంచే ప్రారంభం కానుందని మంత్రి వెల్లడించారు. ఈ విడతలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నట్లు, ప్రతి నియోజకవర్గానికి 2 వేల ఇళ్లను కేటాయిస్తామని చెప్పారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి నాలుగు విడతల్లో రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఇప్పటికే మంజూరైన 4.50 లక్షల ఇళ్లకు సంబంధించి ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నట్లు తెలిపారు.  రాష్ట్ర ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, ఆర్డీఓ శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.