గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ, జూలై 30 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ శివారులో మంజీరా నదిపై ఇటీవల నిర్మాణం పూర్తయిన చెక్‌డ్యామ్‌లో గత మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సమృద్ధిగా నీరు చేరి జలకళ సంతరించుకుంది. చెక్‌డ్యామ్ నిండుకుండలా పొంగిపొర్లుతుండటంతో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు,ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గురువారం చెక్‌డ్యామ్‌ను సందర్శించి నీటి నిల్వలను పరిశీలించారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలతో కలిసి చెక్‌డ్యామ్ వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి పూలు సమర్పించారు.
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఎమ్మెల్యే పోచారం ఆకాంక్షించారు.చెక్‌డ్యామ్ నిర్మాణం పూర్తయిన కొద్ది రోజులకే భారీగా నీరు చేరి పొంగిపొర్లుతుండటంతో రైతులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ చెక్‌డ్యామ్ వల్ల భూగర్భ జలాల మట్టం పెరగడంతో పాటు సాగునీటి అవసరాలు, తాగునీటి అవసరాలకు కూడా దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణకు చెక్‌డ్యామ్‌లు కీలక పాత్ర పోషిస్తాయని, ఇటువంటి నిర్మాణాలు వ్యవసాయాభివృద్ధికి, భూగర్భ జలాల పరిరక్షణకు ఎంతో దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. చెక్‌డ్యామ్‌లో నీరు ఉప్పొంగుతూ ఉండటంతో పరిసర ప్రాంతాలు ఆహ్లాదకరంగా మారగా, స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని జలకళను తిలకించారు.అయన వెంట యువజన నాయకులు మియాపురం శశికాంత్, మాజీ ఎంపీపీ రఘు, కొరిమె రఘు, దుంపల రాజు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు ఉన్నారు.






