10 June, 2026 | 3:01 AM

వైద్యసేవల్లో నిర్లక్ష్యం సహించం

10-06-2026 01:41 AM

కలెక్టర్ కె. హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్  9 (విజయక్రాంతి): జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ యువరాజు మర్మాట్తో కలిసి జిల్లాలోని పీహెచ్సీ, సీహెచ్సీ వైద్యాధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.వైద్యులు, హెల్త్ సూపర్వైజర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచించారు.

సమయపాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బంది హాజరును ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారానే నమోదు చేసుకోవాలని ఆదేశించారు. తమ పరిధిలోని గర్భిణీలు, బాలింతల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అవసరమైన మందులు, టీకాలు సకాలంలో అందేలా చూడాలని సూచించారు.ఆసుపత్రులకు వచ్చే రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, గ్రామాల్లో వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సీతారాం, ఉప వైద్యాధికారి నాగేందర్, వైద్యాధికారులు, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.