తుమ్మిడిహట్టిని పునరుద్ధరిస్తాం
- కాళేశ్వరంతో లక్షన్నర కోట్ల వరకు భారం
- పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేర కు ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి (తుమ్మిడిహట్టి) ప్రాజెక్టును తిరిగి గాడిలో పెడతామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి తుమ్మిడిహట్టి ప్రాజెక్టును సందర్శించి పను లను వేగవంతం చేస్తామని ప్రకటించారు.
సాంకేతికంగా లోపభూయిష్ఠ మైన, ఆర్థికంగా భారమైన కాళేశ్వరం రూపకల్పనకు బదులుగా, తక్కువ వ్యయంతో, తక్కువ విద్యుత్ వినియోగంతో, దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే అసలు ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని ప్రకటించారు. ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సమక్షంలో కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితి, పునరావాస కార్యాచరణపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజీ పునాదులు నిర్మాణపరంగా దెబ్బతిన్నాయని, పూర్తి స్థాయి శాస్త్రీయ పునరుద్ధరణ పూర్తికాకుండానే నీటిని నిల్వ చేయడం ప్రజల ప్రాణాలు, ప్రభుత్వ ఆస్తులు, దిగువ ప్రాంతాల భద్రతతో చెలగాటమాడటమే అవుతుందన్నారు.
సీఏజీ 2022 నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం అప్పటికే రూ.1.27 లక్షల కోట్లను దాటిందని, ప్రస్తుతం మొత్తం పెట్టుబడి రూ.1.50 లక్షల కోట్లకు మించి ఉండే అవకాశముందని మంత్రి తెలిపారు. నేడు నిర్మాణ సంక్షోభంలో చిక్కుకోవడం అత్యంత దురదృష్టకరమన్నారు.
72 కిలోమీటర్ల వరకు గ్రావిటీ ద్వారానే..
తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు ఏడాదికి సుమారు 3,466 మెగావాట్ల విద్యుత్ సరిపోతే, కాళేశ్వరం కోసం దాదాపు 8,450 మెగావాట్ల విద్యుత్ అవసరమయ్యే విధంగా రూపకల్పన చేశారని మంత్రి చెప్పారు. సీఏజీ నివేదికలోనే కాళేశ్వరం పంపులు అన్నీ ఒకేసారి పనిచేస్తే తెలంగాణ రాష్ట్ర మొత్తం విద్యుత్ వినియోగానికి సమానమైన విద్యుత్ అవసరమవుతుందన్నారు.
తుమ్మిడిహట్టి రూపకల్పనలో 72 కిలోమీటర్ల వరకు గ్రావిటీ ద్వారా నీటి ప్రవాహం ఉండేదని, ఎల్లంపల్లి వద్ద కేవలం 19 మీటర్ల లిప్ట్‌తోనే లక్ష్యం సాధ్యమయ్యేదని, విద్యుత్ వ్యయం భారీగా తగ్గడమే కాకుండా, నిర్వహణ వ్యయం కూడా గణనీయంగా తగ్గేదన్నారు. సుమారు రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు స్థానంలో రూ.లక్షన్నర కోట్లకు పైగా భారాన్ని మోపిన కాళేశ్వరం వచ్చిందని, ఫలితంగా ఉత్తర తెలంగాణ సాగునీటి ప్రయోజనాలు ఆలస్యమవడమే కాకుండా, రాష్ట్రంపై అపార ఆర్థిక, విద్యుత్ భారం పడిందని మంత్రి తెలిపారు.
గత ఐదేళ్లలో మేడిగడ్డ ద్వారా 165 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తే, అందులో 63 టీఎంసీలను వరదల కారణంగా తిరిగి నదిలోకి వదలాల్సి వచ్చిందని, మరో 20 టీఎంసీల నీరు ఆవిరైపోయిందని వివరించారు. ఇది ప్రాజెక్టు రూపకల్పనలోని లోపాలకు నిదర్శనమన్నారు.






