ఎలాన్ మస్కా .. మజాకా!
ఒక్కరోజులోనే ఆకాశానికి షేర్లు
ముఖేష్ అంబానీ ఆస్తుల కంటే ఎక్కువ సంపద
వాషింగ్టన్, జూన్ 17: ప్రపంచ తొలి ట్రిలియనీర్ ఎలాన్ మస్క్ సంపద ఒక్కరోజులోనే భారత కుబేరుడు ముకేశ్ అంబానీ కంటే రెట్టింపయ్యింది. ముకేష్ అంబానీ సంపద 89.7 బిలియన్ డాలర్లుగా ఉండగా, మస్క్ నికర సంపద 1.3 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. స్పేస్ ఎక్స్ షేర్ల ధరలు ఒక్కసారిగా రాకెట్ల దూసుకువెళ్లడమే ఆయన ట్రిలియనీర్ అయ్యేందుకు కారణం. పబ్లిక్ ఇష్యూలో షేర్ ధర 135 డాలర్లు కాగా, ప్రస్తుతం 200 డాలర్లు దాటి పరుగులు పెడుతోంది.
టెస్లా, స్పేస్‌ఎక్స్ లాంటి వాటిలో మస్క్‌కు ఉన్న వాటాలే ప్రధాన ఆదాయవనరులు. కాగా మరోవైపు అంబానీ షేర్లలో కూడా పెరుగుదల నమోదైనప్పటికీ మస్క్ షేర్లతో పోల్చుకుంటే తక్కువే. భారతదేశ జీడీపీతో పోలిస్తే మస్క్‌సంపద నాలుగో వంతు కావడం గమనార్హం. స్పేస్ ఎక్స్‌లో మస్క్‌కు 480 కోట్ల షేర్లు ఉన్నాయి. దీంతో ఆయన సంపద ట్రిలియన్ డాలర్లను దాటేసింది.
కాగా ఆయన సంపద పెరగడం పట్ల ఆయా సామాజిక మాధ్యమాల్లో ఆశ్చర్యకర గణాంకాలు ఓ వైపు వెళువడుతుండగా, మరోవైపు జోకులు కూడా పేలుతున్నాయి. ప్రస్తుత సంపదలో ప్రతిగంటకు ఒక మిలియన్ డాలర్లను ఖర్చుపెట్టినా 2140వ సంవత్సరం వరకు మస్క్ సంపద తరగదని సామాజిక మాధ్యమాల్లో గణాంకాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ట్రంప్‌తో జతకట్టాక ఎలన్ మస్క్ ప్రయాణం ఊగిసలాట మధ్యే కొనసాగింది. పలుమార్లు అయితే ఇద్దరి మధ్య చెడిందనే వార్తలు కూడా వచ్చాయి. అయినా వీరి స్నేహం ‘ఇద్దరూ ఇద్దరే’ అన్నట్లుగా కొనసాగుతూనే ఉంది.






