18 June, 2026 | 2:43 AM

శివసేన యూబీటీలో సంక్షోభం

18-06-2026 01:17 AM

ఉద్ధవ్ థాకరే శిబిరంలో తిరుగుబాటు

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌షిండే

శివసేనలోకి యూబీటీ ఆరుగురు ఎంపీలు!

పార్టీ, పదవులకు రాజీనామా చేయాలి: ఎంపీ సంజయ్‌రౌత్

ముంబై/న్యూఢిల్లీ, జూన్ 17: దేశ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్రలో మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(యూబీటీ) మరోసారి చీలడానికి వేగంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఉద్ధవ్ థాకరే శిబిరంలో తిరుగుబాటు ఎంపీలు.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ఈ పరిణామం నిజమైతే, 2022లో జరిగిన పార్టీ చీలిక తర్వాత ఉద్ధవ్ థాకరేకు ఇది మరో పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. శివసేన యూబీటీ రెబల్ ఎంపీలకు పార్టీ మారేందుకు రూ.50 కోట్ల ఆఫర్ ఇస్తున్నారని, రూ.15 కోట్లను ఆడ్వాన్స్‌గా ఇచ్చారని ఎంపీ సంజయ్‌రౌత్ ఆరోపించారు. అలాగే, పార్టీని వీడాలనుకునే అసమ్మతి ఎంపీలు ముందుగా తమ పదవులకు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.

నేడు ముంబైలో శివసేన(యూబీటీ) పార్టీ పార్లమెంటరీ సమావేశం నిర్వహిస్తున్నామని, ఎంపీలందరికీ విప్ జారీ చేశామని తెలిపారు. అంతేకాకుండా పార్టీ మారే ఎంపీలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఓంబిర్లాకు వినతి చేశామని తెలిపారు. ఇటీవలి కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనం అయిన సంగతి తెలిసిందే. మరోవైపు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో మెజారిటీ ఎంపీలు ఆ పార్టీ అధిష్ఠానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. వీరంతా కూడా ఎన్డీయేకు మద్దతు తెలుపనున్నారు.

ఇదిలా ఉండగానే, మహారాష్ట్రలో మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీ మరోసారి చీలిక దిశగా పయనిస్తోంది. లోక్‌సభలో శివసేన యూబీటీకి తొమ్మిది మంది ఎంపీలు ఉండగా... అందులో ఆరుగురు ఎంపీలు ఉద్దవ్‌ఠాక్రే నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. బుధవారం శివసేన యూబీటీకి చెందిన ఆరుగురు ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఒక లేఖ సమర్పించారు. అయితే ఆ లేఖలో ఏముందనే వివరాలు స్పష్టంగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఉన్న శివసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 19న వీరంతా ఆ పార్టీ గూటికి చేరనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

రాజకీయవర్గాలు దీనిని ‘ఆపరేషన్ టైగర్’గా అభివర్ణిస్తున్నా యి. ఈ ఆపరేషన్ అనేది... శివసేన యూబీటీ ఎంపీలను షిండే వర్గంలోకి చేర్చుకునే ప్రయత్నం. అయితే పార్టీ వీడనున్న ఎంపీలపై చర్యలు తీసుకునేలా ఉద్దవ్ ఠాక్రే ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబైలో గురువారం జరిగే శివసేన యూబీటీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరుకావాలని తమ ఎంపీలందరికీ విప్ జారీ చేసింది. అయితే ఈ సమావేశానికి హాజరుకాని వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉద్దవ్ ఠాక్రే ఉన్నారు. 

ఒక్కో ఎంపీకి రూ.50 కోట్ల రేటు: ఎంపీ సంజయ్‌రౌత్ 

తాజా పరిణామాలపై శివసేన యూబీటీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా స్పందించారు. శివసేన యూబీటీకి చెందిన కొందరు ఎంపీలు పార్టీ మారేందుకు వారికి రూ.50 కోట్ల ఆశ చూపారని ఆరోపించారు. సంజయ్ రౌత్ న్యూఢిల్లీలో విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ... తమ పార్టీలో మరోసారి చీలిక వస్తే మహారాష్ట్ర ప్రజలు, శివసేన యూబీటీ ఎంపీలు ఊరుకోరని స్పష్టం చేశారు. ‘పార్టీ మారేందుకు రూ.50 కోట్ల రేటు అని... అందులో రూ.15 కోట్లు అడ్వాన్స్‌గా ఇస్తేనే.. వారంతా ఢిల్లీకి రావడానికి విమానం ఎక్కారని ఆరోపించారు.