14 July, 2026 | 2:22 PM

చంద్రబాబుకు ఘనస్వాగతం

06-07-2024 01:26 AM
  • సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి హైదరాబాద్‌కు 
  • బేగంపేట ఎయిర్‌పోర్టుకు భారీగా తరలివచ్చిన టీడీపీ నేతలు 

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన చంద్రబాబునాయుడుకు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి నేరుగా బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న చంద్రబాబును టీటీడీపీ నాయకులు గజమాలతో సత్కరించారు. అనంతరం ఎయిర్ పోర్టు నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వరకు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. ఓవైపు వర్షం పడుతున్నా నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వందలాది కార్లు, వేలాది బైకులతో ఈ ర్యాలీ నిర్వహించారు.

దేనికి సంకేతం?

హైదరాబాద్‌లో చంద్రబాబుకు స్వా గతం పలుకుతూ నిర్వహించిన ర్యాలీపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో తనకు పట్టు ఉందని ఈ ర్యాలీ ద్వారా చంద్రబాబు పరోక్ష సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం తెలంగాణలో ర్యాలీ నిర్వహించడమేంటని, ఇది బలప్రదర్శన మాదిరిగా ఉందని, దీని వెనుక కచ్చితంగా రాజకీయ కోణం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.