పౌష్టిక అల్పాహార పథకం అమలుకు ఏర్పాట్లు వేగవంతం
నిజాంసాగర్‌లోని ఏ ఎం సి గోదాంలో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ కిచెన్ పరిశీలన
నిజాంసాగర్, జూలై 14(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టిక అల్పాహార పథకం తో పాటు జూనియర్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న నేపథ్యంలో, ఈ పథకాన్ని కామారెడ్డి జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు వేగవంతం అవుతున్నాయి. ఈ క్రమంలో నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఏ ఎం సి గోదాంలో ఇంటిగ్రేటెడ్ కిచెన్ ఏర్పాట్లను జిల్లా విద్యాశాఖాధికారి ఎల్. మల్లికార్జున్ , మండల విద్యాశాఖాధికారి వై. తిరుపతి రెడ్డి గోదాంలోని వంటశాల ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా గోదాంలో అందుబాటులో ఉన్న స్థలం, వంటశాల నిర్మాణానికి అవసరమైన మౌలిక వసతులు, విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం మరియు మధ్యాహ్న భోజనం సిద్ధం చేయడానికి అవసరమైన నీరు, విద్యుత్ సదుపాయాలపై అధికారులు పరిశీలన చేశారు. ఇక్కడి నుంచి జిల్లా వ్యాప్తంగా ఆహార సరఫరా ఎలా చేపట్టాలనే అంశంపై పథకం నిర్వహణలో భాగస్వామ్యమైన హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో ఫోన్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పౌష్టిక అల్పాహార పథకం విజయవంతమైన అమలుకు జిల్లా స్థాయిలో అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.






