గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎస్‌బీఐటీ విద్యార్థి
ఖమ్మం హెల్త్ విజయక్రాంతి: ఖమ్మంలోని స్వర్ణ భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎస్‌బీఐటీ) ఈఈఈ తృతీయ సంవత్సరం విద్యార్థి గడ్డం భూపతి గిన్నీస్ వరల్డ్(Guinness World Records) రికార్డులో స్థానం సంపాదించాడు. హైదరాబాద్‌లో విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, జె.ఆర్. ఇంటర్నేషనల్ టైక్వాండో అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో 1,212 మంది పాల్గొన్న అతిపెద్ద కటాస్ ప్రదర్శనలో భాగస్వామిగా ఈ ఘనత సాధించాడు. సుమారు 40 నిమిషాల నిడివి గల కటాస్‌ను కేవలం 20 నిమిషాల్లో పూర్తి చేసి ప్రశంసలు అందుకున్నాడు.
ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ గుండాల కృష్ణ, వైస్ ఛైర్మన్ కె. శ్రీచైతన్య, ప్రిన్సిపాల్ డా. జి. రాజ్‌కుమార్, సెక్రటరీ డా. జి. ధాత్రి భూపతిని అభినందించారు. భూపతి తండ్రి గడ్డం ఉపేందర్ కరాటే మాస్టర్ అని, తల్లిదండ్రుల ప్రోత్సాహం, కృషి, పట్టుదలతోనే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. భూపతి భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి కళాశాలకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్లు, అధ్యాపకులు, ఈఈఈ విభాగ అధ్యాపకులు పాల్గొన్నారు.






