23 May, 2026 | 1:50 AM

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

23-05-2026 12:12 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 22(విజయ క్రాంతి): జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు చేపడుతున్నామని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ తెలిపారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి, సన్నరకం ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్, చేయూత పెన్షన్, కళ్యాణలక్ష్మి-షాదీ ముబారక్, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ చీరలు వంటి పథకాలు అర్హులకు అందజేస్తున్నట్లు తెలిపారు.

త్వరలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహారం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, కుటుంబ జీవిత బీమా, దివ్యాంగ విద్యార్థులకు వాహనాలు, పంటల మార్పిడి, సేంద్రియ వ్యవసాయం, ఆయిల్పామ్ సాగు ప్రోత్సాహక కార్యక్రమాలను కూడా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

సర్పంచులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పేదలకు సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్ ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. వివిధ శాఖల అధికారులు తమ శాఖల కార్యక్రమాలను వివరించారు.

జల్ జీవన్ మిషన్తో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు...

జల్ జీవన్ మిషన్ ద్వారా జిల్లాలో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ తెలిపారు.శుక్రవారం న్యూఢిల్లీ నుంచి కేంద్ర జలశక్తి, గృహ నిర్మాణ-పట్టణ వ్యవహారాల శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు.

జల్ జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఇంటింటికీ తాగునీటి సరఫరా, గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి లక్ష్మీనారాయణ, మిషన్ భగీరథ ఈఈ సిద్దిఖ్ తదితరులు పాల్గొన్నారు.