23 May, 2026 | 1:47 AM

అందరి భాగస్వామ్యంతోనే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు

23-05-2026 12:14 AM

 కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, మే 22 (విజయక్రాంతి) : ప్రజల సహాకారంతోనే జిల్లాలో ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాలులో ప్రజా పాలనా - ప్రగతి ప్రణాళిక మంచిర్యాల జిల్లా స్థాయి సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి గణపతి, ముఖ్య ప్రణాళిక అధికారి పాపయ్య, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, చెన్నూర్, బెల్లంపల్లి, క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్లు పద్మ, స్వాతి, సంధ్యారాణిలతో కలిసి హాజరై మాట్లాడారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రెండు పడక గదుల ఇండ్లను అర్హత మేరకు లబ్ధిదారులకు లాటరీ పద్ధతిన పారదర్శకంగా కేటాయిస్తున్నామని, ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులైన లబ్ధిదారులకు కేటాయించామని, దశల వారీగా బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయని, ఎవరికైనా బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లయితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువస్తే చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

త్వరలోనే రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళ శక్తి భవన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. నూతన పింఛన్ల కోసం ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని, రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులైన వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు.

వేసవిలో ప్రజలకు త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, నీటి సరఫరా లో ఏదైనా సమస్య ఉన్నట్లయితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. పిల్లలలో పోషకాహార లోపాన్ని నియంత్రించేందుకు ప్రాథమిక పాఠశాల నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు ఉదయం అల్పాహారం పథకం త్వరలో ప్రారంభిస్తామన్నారు.

జిల్లాలోని దండేపల్లి మండలం రెబ్బన్ పల్లి, చెన్నూర్ మండలం సోమనపల్లి, బెల్లంపల్లి మండల కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను మంజూరు చేసి ఒక్కొక్క పాఠశాలకు రూ. 200 కోట్ల నిధులతో పనులు పురోగతిలో ఉన్నాయని, ఈ పాఠశాలల ద్వారా విద్యార్థులకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన విద్యను అందించేందుకు కృషి చేస్తామన్నారు.

ప్రతి ఒక్కరికి బీమా సదుపాయం కల్పించేలా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలు చేసేందుకు, దివ్యాంగులకు మోటరైజడ్ వాహనాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యవసాయంలో పంట మార్పిడి విధానము ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించి వ్యాపార, వాణిజ్య పంటలతో పాటు కూరగాయల సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, జిల్లా సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.