9 May, 2026 | 5:35 AM

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు

09-05-2026 12:00 AM

రాష్ట్ర ఆబ్కారీ - మధ్య నిషేధ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 8 (విజయక్రాంతి): అర్హత గల ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆబ్కారీ - మధ్య నిషేధ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

శుక్రవారం జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్ క్లబ్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్లు, రెండు పడక గదుల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆదిలాబాద్ శాసనమండలి సభ్యులు దండే విఠల్, జిల్లా కలెక్టర్ కె. హరిత, ఎస్.పి. నితికా పంత్, జిల్లా అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, సిర్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కామ్డే అనిల్, మున్సిపల్ చైర్ పర్సన్ షాహిన్ సుల్తానా లతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రికి మాట్లాడుతూ జిల్లాలో రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందని తెలిపారు. బోరిగాం శివారులో నిర్మించిన 2 పడక గదుల ఇండ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. కాగజ్ నగర్ పట్టణానికి మొదటి విడతలు 630 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని, మొదటి విడతలో రానివారు నిరాశ చెందవలసిన అవసరం లేదని, అర్హత గల వారికి రెండవ విడతలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.

కాగజ్ నగర్ పట్టణ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, రహదారి విస్తరణ, మురుగు కాలువల వ్యవస్థ, సి సి రహదారుల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న వంతెనల పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొమురం భీం ప్రాజెక్టు ఆనకట్ట పనులు సి డబ్ల్యూ సి నివేదిక రాగానే ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

శాసనమండలి సభ్యులు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. కాగజ్ నగర్ పట్టణ అభివృద్ధికి 18 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని తెలిపారు. మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అందజేయడంలో ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. సిర్పూర్ శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రాణహిత నదిపై బరాజ్ నిర్మాణం చేపడితే ఈ ప్రాంతానికి సాగునీరు అంది భూములు సస్యశ్యామలం అవుతాయని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి ప్రజా ప్రతినిధులు అందరూ సమిష్టిగా కృషి చేద్దామని తెలిపారు.

కాగజ్ నగర్ పట్టణ అభివృద్ధికి అదనంగా నిధులు మంజూరు చేయాలని, పోడు భూములను సాగు చేయకుండా అటవీ అధికారుల అడ్డుపడుతున్న సమస్యను పరిష్కరించాలని, కార్మికుల సంక్షేమం కోసం సిర్పూర్ పేపర్ మిల్ యాజమాన్యం దృష్టి సారించాలని తెలిపారు.అనంతరం 288 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పి.డి. టి.ఎన్. ప్రకాష్ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.