అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, జూన్ 10,(విజయక్రాంతి): 99 రోజుల ప్రజాపాలనప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వేములవాడ మున్సిపల్ 11, 24 వార్డులు, వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామంలో నిర్వహించిన వార్డు, గ్రామ సభల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వర్షాకాల సన్నద్ధత, పారిశుద్ధ్యం, జల సంరక్షణ, వనమహోత్సవం, మహిళల భద్రత, సురక్షిత తాగునీరు, పంటల మార్పిడి, ఓటరు జాబితా సవరణ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని అన్నారు.
కుల, మత, పార్టీ భేదాలు లేకుండా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని, రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.రైతులు వ్యవసాయ అధికారుల సూచనలతో ఆయిల్ పామ్, సన్న వడ్లు, పప్పుధాన్యాలు, కూరగాయల సాగుకు ముందుకు రావాలని సూచించారు.
వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులు రూ.150 కోట్లతో కొనసాగుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి, ఆర్డీవో కేఎస్బీ కుమారి, కమిషనర్ లోకేష్, డీఎస్పీ శ్రీనివాస్, సీఐ వీరప్రసాద్ మండల ప్రత్యేక అధికారి లక్ష్మీరాజం, మల్లారం సర్పంచ్ అర్పిత రెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






