17 March, 2026 | 6:35 AM

పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ, డీజీపీ బదిలీ

17-03-2026 02:20 AM
  1. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం
  2. అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ అధికారులపై వేటు

కోల్‌కతా, మార్చి 16: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), హోం సెక్రటరీలను ఆ పదవుల నుంచి తప్పించింది. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

ఆదివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన లేఖలో రాష్ట్ర ఎన్నికల సన్నద్ధతను సమీక్షించిన తర్వాత ఇద్దరు అధికారులను విధుల నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ తెలిపింది. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ నందిని చక్రవర్తి, హోం సెక్రటరీ జగదీష్ ప్రసాద్ మీనాలను తక్షణమే బదిలీ చేయాలని ఆదేశించింది. నందిని చక్రవర్తి స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి దుష్యంత్ నారియాలా ప్రధాన కార్యదర్శిగా నియమితులవుతారు, పీయూష్ పాండే స్థానంలో ఉన్నత పోలీసు అధికారి సిద్ధ్ నాథ్ గుప్తాను డీజీపీగా నియమితులయ్యారు.

కోల్‌కతా పోలీస్ కమిషనర్‌తో సహా మరో ముగ్గురు సీనియర్ అధికారులను కూడా కమిషన్ బదిలీ చేసింది.ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు బదిలీ అయిన అధికారులకు ఎలాంటి ఎన్నికల సంబంధిత బాధ్యతలు అప్పగించవద్దని ఈసీ స్పష్టం చేసింది.నియామకాలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పశ్చి మ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే మమతా బెనర్జీ ప్రభుత్వంలోని కీలక అధికారులపై ఈసీ వేటు వేయడం రాజకీయంగా ప్రాధా న్యం సంతరించుకుంది.ఈ పునర్వ్యవస్థీకరణపై తృణమూల్ కాంగ్రెస్ స్పందిస్తూ, ఎన్నికలకు ముందు రాష్ట్ర పరిపాలనలో బీజేపీ, ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది. ‘బెంగాల్ సంకల్పాన్ని ఏ కుట్ర కూడా అణచివేయలేదు’ అని పార్టీ ‘ఎక్స్’లో పేర్కొంది.